నయనతార ప్రధాన పాత్రలో దర్శకుడు సుందర్.సి తెరకెక్కించిన చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’. నవంబర్ 6న దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో 'మహాశక్తి' పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోని గ్రాఫిక్స్‌పై కొందరు నెటిజన్లు విమర్శలు చేయడంతో పాటు, సినిమాలో ఏఐ టెక్నాలజీని విపరీతంగా ఉపయోగించారనే కామెంట్స్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు సుందర్.సి ఈ విమర్శలపై స్పందించారు.
‘మూకుత్తి అమ్మన్ 2’ గ్రాఫిక్స్ పనుల కోసం దాదాపు 800 మంది ఏడాదిన్నర పాటు కష్టపడ్డారని సుందర్.సి వెల్లడించారు. సినిమాలో 3 వేలకుపైగా గ్రాఫిక్స్ షాట్స్ ఉన్నాయని, వాటిలో కేవలం 15 షాట్స్‌కు మాత్రమే ఏఐ టెక్నాలజీని ఉపయోగించామని స్పష్టం చేశారు. సినిమా మొత్తం ఏఐతోనే రూపొందించారనే ప్రచారంలో నిజం లేదని తెలిపారు. ఈ చిత్రంలో పూర్తిగా తమిళ టెక్నీషియన్లు, కళాకారులే పనిచేశారని చెప్పారు. ఇంతమంది కష్టాన్ని గుర్తించకుండా గ్రాఫిక్స్ బాగోలేవంటూ విమర్శలు చేయడం తనను కొంత బాధించిందని అన్నారు.
తన కెరీర్‌లోనే అత్యంత కష్టపడి తెరకెక్కించిన సినిమా ఇదేనని సుందర్.సి పేర్కొన్నారు. సీరియస్ సినిమాల కంటే కామెడీ సినిమాలు తీయడమే చాలా కష్టమని, ఈ చిత్రాన్ని నిర్మించేందుకు తనపై నమ్మకంతో ముందుకొచ్చిన నిర్మాత ఇషారి గణేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా చూసిన తర్వాత నచ్చితే ప్రశంసించాలని, నచ్చకపోతే తప్పులను సున్నితంగా తెలియజేయాలని, వాటి నుంచి తాము నేర్చుకుంటామని ప్రేక్షకులను కోరారు.
ఇక ‘మూకుత్తి అమ్మన్ 2’లో నయనతారతో పాటు రెజీనా కసాండ్రా, ఊర్వశి, అభినయ, యోగిబాబు, మైనా నందిని, దునియా విజయ్, సింగంపులి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హిప్‌హాప్ తమిళా ఆది సంగీతం అందించారు. 2020లో విడుదలైన మొదటి భాగానికి ఆర్.జే. బాలాజీ దర్శకత్వం వహించగా, రెండో భాగాన్ని సుందర్.సి తెరకెక్కించారు. ఈ రెండు భాగాల కథలకు నేరుగా సంబంధం లేదని చిత్రబృందం ఇప్పటికే స్పష్టం చేసింది. మరి నవంబర్ 6న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
[Mookuthi Amman 2, Sundar C, Nayanthara, Mookuthi Amman 2 Graphics, AI Technology, Regina Cassandra, Mookuthi Amman 2 Release Date]






