Home

»

Latest News

మద్యానికి బానిసై: ఎంతో మందిని నవ్వించి 30 ఏళ్ళు అజ్ఞాతవాసం చేసి కన్నుమూసిన నటి!

Oct 31, 2026 3:51PM

తార.. సినీ తార.. ఆకాశంలో స్టార్ ఎంత దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుందో, సినీ తార కూడా అంతే. ప్రేక్షకుల గుండెల్లో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది.  అభిమానులైతే 'ఆకాశంలో ఒక తార నా కోసమొచ్చింది ఈ వేళ' అని పాడుకుంటారు. అలాంటి  తార మీనాకుమారి మరణం ఆ అందరికి ఒక శాపం.

 ప్రముఖ హాస్యనటి మీనాకుమారి జీవితం వెనుక ఎవరికీ తెలియని ఎన్నో విషాద దాగున్నాయి. తెనాలికి చెందిన మీనాకుమారి చిన్న వయసులోనే నెల్లూరుకి  చెందిన ఫిలిం డిస్ట్రిబ్యూటర్ వై.సుబ్బారావుని వివాహం చేసుకుంది. ఆమెలోని అందాన్ని, అభినయాన్ని గుర్తించిన సుబ్బారావు ఆమెకు నటనలో, నాట్యంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించి చెన్నై తీసుకువచ్చారు. ఆ తర్వాత నటి చంద్రకళ తండ్రి నాయక్ నిర్మించిన 1958 నాటి 'శ్రీరామాంజనేయ యుద్ధం' చిత్రంతో మీనాకుమారి వెండితెరకి పరిచయమయ్యింది. తొలి రోజుల్లో ఆర్టిస్టుగా నిలదొక్కుకోవాలనే తపనతో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి వేషం వేశారు.నటిగా ప్రతిభతో పాటు క్యారక్టర్ ల ఎంపిక కూడా ముఖ్యమనే విషయం ఆ రోజుల్లో ఆమెకి తెలియకపోవడంతో చివరికి హాస్యనటిగా స్థిరపడ్డారు. మొదట్లో మితభాషిగా ఉండి సెట్‌లో ఎవరితోనూ కలవని ఆమె, ఆ తర్వాత పరిచయాలు కెరీర్‌కు ఎంతో లాభమని గ్రహించి అందరితోనూ స్నేహంగా మెలిగారు. భాషపై పట్టు సాధించడానికి ఎన్నో నవలలు చదవడంతో పాటు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాలను ఎక్కువగా వీక్షించి డైలాగ్ డెలివరీలో మెళకువలు నేర్చుకున్నారు.


అప్పట్లో ఎన్టీఆర్, దర్శకుడు కె.వి. తిలక్ మీనాకుమారిని ఎంతగానో ప్రోత్సహించారు. దాదాపు ఎన్టీఆర్ నటించిన ప్రతి చిత్రంలోనూ ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. అంజిగాడు, బాలకృష్ణ చిత్రాలలో ఆమెది అప్పట్లో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది. పద్మనాభం, రాజబాబుల సరసన కూడా నటించి దాదాపు 200 చిత్రాల్లో భాగమయ్యారు. హాస్యనటిగా రమాప్రభ రంగప్రవేశం చేసే వరకు తెలుగు తెరపై మీనాకుమారిదే పూర్తి హవా సాగింది. అయితే తారాస్థాయిలో దూసుకుపోతున్న సమయంలో, 1968 ప్రాంతాల్లో ఆమె సొంతంగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ఒక జానపద చిత్రాన్ని నిర్మించడం ప్రారంభించారు. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత తీవ్రమైన ఆర్థిక కారణాల వల్ల ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. 


ఇది కూడా చదవండి: ప్రకాష్ రాజ్ భార్య సంచలన ఇంటర్వ్యూ: పాపం ప్రకాష్ రాజ్!

ఈ పరిణామం ఆమెని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది. ఆ రోజుల్లో మహానటి సావిత్రి, సురభి బాలసరస్వతిలతో మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందుల వల్ల మద్యానికి బానిసయ్యారు. ఈ వ్యసనం ఆమె కెరీర్‌ను క్రమంగా దెబ్బతీయడమే కాకుండా, చేతికొచ్చిన ఎన్నో అగ్రశ్రేణి అవకాశాలను కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత ఆమె నటించిన చివరి చిత్రం 1977లో విడుదలైన 'జీవితంలో వసంతం'. ఆ చిత్రం తర్వాత ఆమె దాదాపు 30 ఏళ్ల పాటు  పరిశ్రమకి దూరంగా అత్యంత దయనీయ స్థితిలో అజ్ఞాతవాసం గడిపారు. చివరికి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ 2007 ఆగస్టు 13న  లంగ్ క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచారు. వెండితెరపై కోట్లాది మందిని కడుపుబ్బా నవ్వించిన మీనా కుమారి  జీవితం, చివరికి కీర్తి శిఖరాల నుంచి పతనమై విషాదాంతం కావడం అందర్నీ బాధపెట్టే విషయం. 

 

[Meenakumari Untold Story Veteran Telugu Comedians Tragis Life, Meenakumari, Telugu Comedian, Tollywood Actress, Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com