
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో కలిసి ఆపద్భాందవుడులో 'ఔరా అమ్మక చెల్లా ఆలకించి నమ్మడ వెళ్ళా అంత వింద గాథల్లో ఆనంద లాలా.. అని ఆడి పాడిన హోమ్లీ బ్యూటీ క్వీన్ 'మీనాక్షి శేషాద్రి'(Meenakshi Seshadri)ని మరవడం అనేది అభిమానులకి జరగని పని. బాలీవుడ్ సెల్యులాయిడ్ ని కూడా తన అద్భుతమైన నటనతో,డాన్సులతో శాసించిన మీనాక్షి సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. దాదాపు 30 ఏళ్ల క్రితం కెరీర్ పీక్ లో ఉన్న సమయంలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టి చిత్ర పరిశ్రమకి దూరమయ్యారు.
రీసెంట్ గా మీనాక్షి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఎమోషనల్ వీడియోని రిలీజ్ చేసారు. అందులో ఆమె మాట్లాడుతూ నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే నటనని మళ్లీ ఆస్వాదించడానికి ముంబై వచ్చాను. నేనేమి ఇక్కడ ఎవరికీ ఏమీ నిరూపించుకోవడానికి రాలేదు. కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. కానీ అంతగా ఆకట్టుకోలేదు. మరికొన్ని చర్చల దశలోనే ఆగిపోయాయని ఆమె నిజాయితీగా అంగీకరించారు. అందుకే ఈసారి ఎలాంటి పీఆర్ ఏజెన్సీల సహాయం లేకుండా, నేరుగా నా ప్రతిభని నమ్మి, అభిమానుల ఆశీస్సులతో మంచి ప్రాజెక్టులను ఎంచుకోవాలని భావిస్తున్నాను. కేవలం లీడ్ రోల్స్ మాత్రమే కాకుండా, కథకు ప్రాధాన్యత ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్ రోల్స్ లేదా ఓటీటీ సిరీస్‌లలోనైనా చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
Also read: Pawan Kalyan: నేడు నిర్మాతలు పవన్ తో భేటీ.. నిన్న చిరుతో ఎగ్జిబిటర్స్ భేటీ
1983లో 'పైంటర్ బాబు' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి, సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో వచ్చిన 'హీరో' సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ తెచ్చుకున్న మీనాక్షి.. ఆ తర్వాత ఘాయల్, షాహెన్‌షా, ఘాతక్, దామిని వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా 1993లో వచ్చిన 'దామిని' సినిమాలో న్యాయం కోసం పోరాడే మహిళగా ఆమె పెర్ఫార్మ్ భారతీయ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. తాజాగా ఆమె రీఎంట్రీ ప్రకటన విన్న అభిమానులు వెల్ కమ్ చెప్తున్నారు. ఆమె కో స్టార్, ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ సైతం స్పందిస్తూ, "మీతో కలిసి మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతగానో కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.






