Home

»

Latest News

టైటిల్ లేదు.. కానీ, రూ. 20 కోట్ల ఓటీటీ ఆఫర్! మణిరత్నం కొత్త సినిమా రికార్డు!

Jul 24, 2026 12:46PM

ప్రేమకథలకు సరికొత్త భాష్యం చెప్పిన దిగ్గజ దర్శకుడు మణిరత్నం. దశాబ్దాలుగా తనదైన మేకింగ్‌తో, హృదయాన్ని తాకే కవితాత్మక ప్రేమకథలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ వస్తున్నారు. 'మౌనరాగం' సినిమాలో గత ప్రేమను కోల్పోయిన ఒక యువతి పెళ్లి తర్వాత పడే ఆవేదనను హృద్యంగా ఆవిష్కరించినా, 'గీతాంజలి' చిత్రంలో ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న ఇద్దరి మధ్య పూచిన అనురాగాన్ని చూపించినా అది ఒక్క మణిరత్నానికే సాధ్యమైంది. అలాగే బొంబాబ‌యి సినిమాలో విభిన్న మతాల నేపథ్యం ఉన్న జంట సమాజపు ఒత్తిళ్లను ఎదుర్కొంటూ సాగించిన ప్రయాణాన్ని అత్యంత శక్తివంతంగా తెరకెక్కించి లవ్ క్లాసిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. కాలం ఎంత మారినా ఆయన అందించిన లవ్ సినిమాలు ఇచ్చిన ఫీల్ ఇప్పటికీ ప్రతి సినీ ప్రియుడి గుండెల్లో చెరగని ముద్ర వేసింది.

ఇప్పుడు మళ్లీ ఆ వెండితెర మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు మణిరత్నం ఒక భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఏ పాత్ర ఇచ్చినా జీవించేసే విజయ్ సేతుపతి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవిలను తొలిసారిగా ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొస్తున్నారు. మద్రాస్ టాకీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 23గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన నాటి నుంచే సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అసలు సిసలైన విశేషం ఏమిటంటే.. ఇంకా టైటిల్ కూడా ఖరారు కాని ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే ఇండస్ట్రీలో ఒక కొత్త రికార్డు సృష్టించింది. కేవలం ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ బజ్ చూసి డిజిటల్ రైట్స్ రూపంలో ఏకంగా రూ. 20 కోట్ల (Rs. 20 Crore) భారీ బిజినెస్ ఆఫర్ రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఓటీటీ వేదికల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ, మణిరత్నం బ్రాండ్ వాల్యూకు, ఈ క్రేజీ కాంబినేషన్‌కు ఉన్న డిమాండ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి చేసిన మేక్ ఓవర్ కూడా సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇన్నాళ్లూ గడ్డం, కాస్త బొద్దుగా ఉండే రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపించిన ఆయన, ఈ ప్రేమకథ కోసం తొలిసారి క్లీన్ షేవ్ చేసి, గణనీయంగా బరువు తగ్గి నయా యంగ్ అండ్ హ్యాండ్‌సమ్ లుక్‌లోకి మారిపోయారు. ఇటీవల కలకత్తా ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన ఆయన కొత్త లుక్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

చిత్రీకరణ పరంగా మేకర్స్ పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. కలకత్తా పరిసరాల్లో ప్రధాన షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత చెన్నై, పాండిచ్చేరి వంటి మనోహరమైన ప్రదేశాలలో మిగిలిన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఎలాంటి హంగులు లేకుండా భావోద్వేగాలనే నమ్ముకునే మణిరత్నం, నేచురల్ యాక్టర్స్ విజయ్ సేతుపతి, సాయి పల్లవిలతో ఎలాంటి క్లాసిక్‌ను ఆవిష్కరించబోతున్నారో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సమాయత్తమవుతున్నారు.

 

 

Mani Ratnam, Vijay Sethupathi, Sai Pallavi

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com