
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒకప్పుడు కొండంత అండగా నిలిచి, పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్యవహరించిన మహానుభావుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao). వందలాది మందికి సినీ జీవితాన్ని ప్రసాదించి, టాలీవుడ్‌ను ముందుండి నడిపించిన ఆయన భౌతికంగా మనకు దూరమైనా ప్రేక్షకుల, అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు.
అయితే, ఇటీవల కాలంలో ఆయన సమాధి అత్యంత దారుణమైన స్థితిలోకి మారిపోవడం, చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు మొలిచి ఒక పాడుబడ్డ అడవిలా తయారవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దారుణమైన స్థితిలో ఉన్న ఆ దృశ్యాలను చూసి కోట్లాది మంది సినీ ప్రేమికులు, దాసరి అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బ్రతికున్నప్పుడు ఆయన చుట్టూ తిరిగిన ఇండస్ట్రీ పెద్దలు గానీ, కోట్ల రూపాయల ఆస్తులను పంచుకున్న వారసులు గానీ కనీసం ఆ సమాధిని శుభ్రం చేయించే నాథుడు లేరా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ క్రమంలోనే మంచు మనోజ్ (Manchu Manoj) చూపించిన చొరవ, ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది. కేవలం సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెట్టడానికే పరిమితం కాకుండా, మంచు మనోజ్ నేరుగా క్షేత్రస్థాయిలోకి రంగంలోకి దిగారు. దాసరి నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సమాధి వద్దకు చేరుకున్న మంచు మనోజ్, అక్కడ ఉన్న దారుణమైన పరిస్థితిని చూసి స్వయంగా శ్రమదానానికి పూనుకున్నారు. సమాధి చుట్టూ దట్టంగా అల్లుకుపోయిన ముళ్ల పొదలను, పిచ్చి చెట్లను, చెత్తాచెదారాన్ని ఆయన స్వయంగా దగ్గరుండి తొలగించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేయించారు.
మంచు మనోజ్ చేసిన ఈ గొప్ప పనికి స్థానిక రాజకీయ నాయకులు కూడా మద్దతుగా నిలిచారు. స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా ఈ కార్యక్రమానికి హాజరై మంచు మనోజ్‌తో చేతులు కలిపారు. సమాధి ప్రాంగణాన్ని శుభ్రం చేసిన అనంతరం, హీరో మంచు మనోజ్, ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇద్దరూ కలిసి దర్శకరత్న దాసరి నారాయణరావు సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. నాడు పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా 'నేనున్నానంటూ' ముందు నిలబడిన ఆ పెద్ద మనిషికి వర్ధంతి వేళ తగిన గౌరవం దక్కేలా చేశారు. మాటల్లో కాకుండా చేతల్లో కృతజ్ఞత చూపించిన మంచు మనోజ్ పై ఇప్పుడు టాలీవుడ్ వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






