టాలీవుడ్‌లో ఏదైనా విషయంపై ముక్కుసూటిగా మాట్లాడటంలో నటి మంచు లక్ష్మి ఎప్పుడూ ముందే ఉంటారు. వివాదాలైనా, క్రేజీ కామెంట్స్ అయినా ఆమె శైలే వేరు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో ఒక జర్నలిస్ట్ అడిగిన అసంబద్ధమైన ప్రశ్నకు మంచు లక్ష్మి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తోటి యాంకర్ రష్మీ గౌతమ్‌ను ఇబ్బంది పెట్టేలా సాగిన సదరు ప్రశ్నపై ఆమె ఘాటుగా రియాక్ట్ అయి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.
తెలుగు పాపులర్ ఓటీటీ సంస్థ 'ఆహా' సరికొత్త కాన్సెప్ట్‌తో 'టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్' అనే వినూత్న షోను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఈ షోకి మంచు లక్ష్మి, గ్లామరస్ యాంకర్ రష్మీ గౌతమ్, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునే హర్ష చెముడు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో లాంచ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ఎంతో గ్రాండ్‌గా నిర్వహించింది.
ఈ మీడియా సమావేశంలో ఒక విలేకరి.. సుడిగాలి సుధీర్ పేరును ప్రస్తావిస్తూ రష్మీ గౌతమ్‌ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. "గతంలో సుధీర్‌తో ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు కదా.. మరి ఈ షో ప్రమోషన్స్ గేమ్స్‌లో ఆయన పేరు చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?" అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రష్మీ ఎంతో సంయమనంతో, నవ్వుతూ సమాధానమిస్తూ తాము ఇక్కడ కేవలం షోను ప్రమోట్ చేయడానికి మాత్రమే వచ్చామని స్పష్టం చేసింది.
రష్మీ సాఫ్ట్‌గా సమాధానం ఇస్తున్నప్పటికీ.. పక్కనే ఉన్న మంచు లక్ష్మికి మాత్రం విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే మైక్ అందుకున్న లక్ష్మి.. "కేవలం క్లిక్ బైట్స్ కోసం, వ్యూస్ కోసం ఇలాంటి ప్రశ్నలు అడిగితే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక జోక్‌ను ఎంతవరకు లాగాలో అంతవరకే లాగాలి. అసలు ఈ షోకి ఏమాత్రం సంబంధం లేని ప్రశ్నలను మళ్లీ మళ్లీ అడగడానికి మీకే బోర్ కొట్టడం లేదా?" అంటూ సదరు జర్నలిస్ట్‌కు గట్టిగా క్లాస్ పీకారు.
ఇక ఈ వివాదం పక్కన పెడితే.. ఈ ఈవెంట్‌లో మంచు లక్ష్మి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 'రాను ముంబాయికి రాను' అంటూ సాగే పాపులర్ సాంగ్‌కు స్టేజ్ మీద ఊరమాస్ స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం తాను ముంబైలోనే సెటిల్ అయ్యానని, అందుకే ఈ పాట తనకు బాగా కనెక్ట్ అయిందంటూ ఫన్నీగా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
బుల్లితెరపై రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ కాంబినేషన్‌కు ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే ప్రతీ ఇంటర్వ్యూలోనూ ఇదే టాపిక్ లాగడంపై నెటిజన్లు కూడా మంచు లక్ష్మి వైపే మొగ్గు చూపుతున్నారు. లక్ష్మి చెప్పింది వంద శాతం నిజమని, అనవసరమైన గాసిప్స్ కంటే షో కంటెంట్‌పై ఫోకస్ పెట్టడమే బెటర్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
విభిన్నమైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఒకే వేదికపైకి తెస్తూ 'ఆహా' ప్లాన్ చేసిన ఈ రియాలిటీ షోపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలోనే స్ట్రీమింగ్ కానున్న ఈ షో డిజిటల్ ఆడియన్స్‌ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.




