మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి దక్షిణాది వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన 'ప్రేమలు' చిత్రంతో ఎంతోమంది కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది అందాల భామ మమితా బైజు. తన సహజసిద్ధమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ నటి తాజాగా ఒక అనూహ్య నిర్ణయం తీసుకుని అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఇకపై సోషల్ మీడియా వేదికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మమితా వెల్లడించింది. వర్చువల్ ప్రపంచంలో లభించే పబ్లిసిటీ కంటే మనశ్శాంతే అత్యంత ప్రధానమని ఆమె స్పష్టం చేసింది. ఇక నుంచి తన వ్యక్తిగత ఖాతాల ద్వారా కాకుండా, సినిమాలకు సంబంధించిన ప్రతి చిన్న అధికారిక సమాచారాన్ని కేవలం పీఆర్ టీమ్ మాత్రమే చూసుకుంటుందని తేల్చిచెప్పేసింది.
ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది ఈ మలయాళ బ్యూటీ. తనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే అమితమైన అభిమానమని, ఆయన నటించిన సినిమాలను పదుల సంఖ్యలో చూశానని చెప్పింది. ముఖ్యంగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో బన్నీ ధరించిన క్యాజువల్ దుస్తులు, క్యాసియో వాచ్ స్టైల్‌ను చూసి తాను కూడా చిన్నప్పుడు అలాగే అనుకరించేదాన్నని సరదాగా గుర్తుచేసుకుంది.
కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన మమితా తండ్రి వృత్తిరీత్యా డాక్టర్ కాగా, ఆమె సైకాలజీలో పట్టభద్రురాలైంది. కుటుంబంలో తన అన్నయ్య మిథున్ రాష్ట్రస్థాయి క్రికెటర్ అని తెలిపింది. తన జీవితంలోని కీలక నిర్ణయాలన్నింటినీ అన్నయ్యే దగ్గరుండి చూసుకుంటాడని, చివరికి లవ్ ప్రపోజల్స్ డీల్ చేయడం నుంచి పెళ్లి వ్యవహారాల వరకు ప్రతీది అతడే నిర్ణయిస్తాడని చిరునవ్వుతో చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం మమితా చేతిలో వరుస భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ సూర్యతో కలిసి 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంలో నటిస్తుండటంతో పాటు, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో పలు విలక్షణమైన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ, తన సినిమాలతో ప్రేక్షకాభిమానులను అలరిస్తూనే ఉంటానని ఈ భామ నమ్మకం వ్యక్తం చేస్తోంది.




