కుటుంబ బంధాలు, మధ్యతరగతి అనుబంధాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈటీవీ సంస్థ నుంచి సరికొత్త ఓటీటీ కంటెంట్ ప్రేక్షకులను పలకరించింది. సరికొత్త కథాంశంతో నేరుగా ఈటీవీ విన్ (ETV Win) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన చిత్రమే 'మధురాపురి సదన'. భరత్ సాయినాథ్ వర్మ, యశు మాశెట్టి జంటగా నటించిన ఈ సినిమాకు సాయి తరుణ్ దర్శకత్వం వహించారు. ఈ గురువారం అంటే జులై 16 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క కలలు, ఆశయాలు, వారు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందుల చుట్టూ తిరిగే ఈ కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ విషయానికి వస్తే, హైదరాబాద్ నగరంలో వాసు (శ్రీనివాస్ భోగిరెడ్డి) ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన పదవీ విరమణకు చాలా దగ్గరగా ఉంటాడు. కూతురు ఇప్పటికే అమెరికాలో స్థిరపడగా, భార్య పద్మ, కొడుకు కృష్ణ (భరత్ సాయినాథ్)లతో కలిసి నివసిస్తుంటాడు. కొడుకు కృష్ణ కూడా అమెరికా వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించాలనేది తండ్రి వాసు కోరిక. కానీ, కృష్ణకు మాత్రం ఎలాగైనా సినిమా దర్శకుడు కావాలనే బలమైన ఆశయం ఉంటుంది. ఈ కెరియర్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య తీవ్ర అసంతృప్తి నెలకొంటుంది. మరోవైపు కృష్ణ తాను నివసించే కాలనీలోనే ఉండే అదితి (యషు మాశెట్టి)ని ప్రేమిస్తాడు. అయితే, ఆమె కూడా కృష్ణ విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలనే కోరుకుంటుంది. కానీ కృష్ణ మాత్రం తన డ్రీమ్ వైపే అడుగులు వేస్తాడు.
ఇదిలా ఉండగా, సొంత ఇల్లు లేదనే వెలితి కృష్ణ తల్లి పద్మను ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది. సొంత గూడు కట్టుకోవాలనే ఆమె ఆశను నెరవేర్చడానికి అమెరికా నుంచి కూతురు కొంత డబ్బు పంపిస్తుంది. దాంతో ఇంటి నిర్మాణ పనులు ఎంతో ఉత్సాహంగా చకచకా మొదలవుతాయి. కానీ కొద్ది రోజుల్లోనే ఆ పనులు హఠాత్తుగా ఆగిపోతాయి. అక్కడి నుంచి ఆ ఇల్లు పూర్తి చేయడం ఆ కుటుంబానికి ఒక పెద్ద సవాలుగా మారుతుంది. తండ్రి దాచుకున్న సేవింగ్స్ డబ్బుతో ఇల్లు పూర్తి చేద్దామని కృష్ణ అనుకుంటే, తండ్రి వాసు ఆ డబ్బును తన బావమరిదికి ఇచ్చి మోసపోయాడని తెలుస్తుంది. అదే సమయంలో, కృష్ణ కూడా ఇంటి కాగితాలను వేరొకరి దగ్గర తాకట్టు పెట్టాడని తండ్రికి తెలుస్తుంది. ఈ గందరగోళ పరిస్థితుల తర్వాత ఆ కుటుంబం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఇల్లు ఎలా పూర్తి అయింది అనేదే మిగతా సినిమా.
దర్శకుడు సాయి తరుణ్ రెడ్డి ఈ చిత్రంలో ఒక మంచి పాయింట్‌ను హైలైట్ చేశారు. కుటుంబంలో ఏ చిన్న నిర్ణయమైనా అందరూ కలిసి ఆలోచించి తీసుకోవాలని, ఒకరిని సంప్రదించకుండా మరొకరు నిర్ణయాలు తీసుకుంటే ఆ ఫ్యామిలీ ఎలాంటి ప్రమాదంలో పడుతుందో చక్కగా చూపించారు. సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు తోడుగా నిలబడాలనే సందేశాన్ని ఇచ్చారు. అయితే, కథలో ఉన్న ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయినప్పటికీ, లవ్ అండ్ రొమాన్స్ ట్రాక్ చాలా పైపైన తేల్చేశారు. కామెడీ పరంగా కూడా బలమైన సన్నివేశాలు లేకపోవడం నిరాశ పరుస్తుంది. హీరో కృష్ణ డైరెక్టర్ కావడానికి చేసే ప్రయత్నాలను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామాను ఇష్టపడే వారికి, ఒక మిడిల్ క్లాస్ యువకుడి పోరాటంగా సాగే ఈ సినిమా ఓ మోస్తరుగా అలరిస్తుంది.





