'బేబమ్మ'కి బ్యాడ్ టైం.. వరుసగా రెండో ఫ్లాప్!
on Aug 12, 2022
యంగ్ బ్యూటీ కృతి శెట్టి కి మరో షాక్ తగిలింది. మొదటి మూడు సినిమాలతో విజయాలను అందుకొని హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కృతి.. ఇప్పుడు వరుసగా రెండు ప్లాప్ లను తన ఖాతాలో వేసుకుంది.
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి.. బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడమే కాకుండా మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో కృతికి అవకాశాలు క్యూ కట్టాయి. 'ఉప్పెన' తర్వాత కృతి నటించిన 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' కూడా హిట్ అవ్వడంతో లక్కీ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే గత నెలలో విడుదలైన 'ది వారియర్'తో మొదటి పరాజయాన్ని చూసింది కృతి. ఇప్పుడు 'మాచర్ల నియోజకవర్గం'తో వరుసగా రెండో పరాజయాన్ని మూట గట్టుకుంది.
నితిన్, కృతి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం' నేడు(ఆగస్టు 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. కథ కథనాల్లో బలం లేదని, అసలు మెయిన్ స్టోరీ లైన్ లోనే లాజిక్ లేదని అంటున్నారు. చూస్తుంటే ఇది బాక్సాఫీస్ దగ్గర మరో ఫెయిల్యూర్ గా మిగలనుంది. దీంతో కృతి ఖాతాలో వరుసగా రెండో ప్లాప్ పడనుంది.
ఇదిలా ఉంటే సుధీర్ బాబు సరసన కృతి నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 16న రిలీజ్ కానుంది. జులై లో 'ది వారియర్', ఆగస్టు లో 'మాచర్ల నియోజకవర్గం'తో షాక్ తిన్న కృతి.. సెప్టెంబర్ లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఒకవేళ అది కూడా పరాజయంపాలైతే.. మొదటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతి.. తర్వాతి మూడు సినిమాలతో హ్యాట్రిక్ ప్లాప్ అందుకున్నట్లు అవుతోంది. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి హ్యాట్రిక్ ప్లాప్స్ తప్పించుకోవాలని ఆశిద్దాం.
ప్రస్తుతం కీర్తి రెండు ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. 'బంగార్రాజు' తర్వాత నాగ చైతన్య సరసన మరో సినిమాలో నటిస్తోంది. దీనికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే సూర్య-బాల కాంబినేషన్ లో రూపొందుతోన్న 'వనంగాన్'(అచలుడు)తో కోలీవుడ్ లోకి అడుగు పెడుతోంది.