Home

»

Latest News

ఇలపై కదిలిన పలుకుల జాబిలి మహానటి కృష్ణకుమారి!

Jan 24, 2018

‘చెప్పాలని ఉంది... దేవతయే దిగి వచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది‘. అవును.. కృష్ణకుమారి నిజంగా దేవతే... కాకపోతే.. ఆ కవి మాత్రం ఎందుకలా రాస్తాడు!. అంత అందం మానవ కాంతలకు సంభవమా? ఏ దివ్యలోకాలను ఏలే దేవతో...  శాప వశాన ఇలా భువిపై అవతరించింది. శాపం తీరిపోయింది.. మళ్లీ ఆ దివ్యలోకాలకే వెళ్లిపోయింది. అతిశయోక్తి అనిపించినా.. కృష్ణకుమారి గుర్తొస్తే.. నిజమేనేమో అనిపిస్తుంది. ఆ సౌందర్యం అలాంటిది. 

ఏదిఏమైనా  కృష్ణకుమారి వెళ్లిపోయింది. ఈ వార్త వినగానే... ఎందుకో ఆశ్చర్యం.  చనిపోయేంత వయసున్న కృష్ణకుమారి చాలామందికి తెలీదు. ఒకవేళ చూసినా.. గుర్తుండదు. ‘కృష్ణకుమారి’ అంటే..  వెండితెరపై మచ్చలేని ఆ నిండు చందమామే గుర్తొస్తుంది. అందుకే ఆశ్చర్యం. 

టీవీల పుణ్యమా అని ఇప్పటికీ అడపాదడపా కృష్ణకుమారి సినిమాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పటి హీరోయిన్లకు కృష్ణకుమారికీ ఎంత తేడా!  ఆ కట్టు, ఆ బొట్టు, ఆ రంగు, ఆ హంగూ... వెండితెరపై పండువెన్నెల కురిపించడానికే దేవుడు ఈ నిండుపున్నమిని పంపాడా? అనిపిస్తుంది కృష్ణకుమారిని చూస్తే. 

సినీ స్వర్ణయుగంలో కృష్ణకుమారి పాత్ర సాధారణమైందా!... ఉమ్మడి కుటుంబం, బందిపోటు, గుడిగంటలు, అగ్గిపిడుగు, లక్షాధికారి, కులగోత్రాలు, శాంతినివాసం,  భార్యాభర్తలు, చదువుకున్న అమ్మాయిలు, కనకదుర్గ పూజామహిమ, చిక్కడు-దొరకడు... అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే... అది పెద్ద లిస్టే.  మహానటి సావిత్రికి ధీటుగా సినిమాలు చేసిన నటి ఆమె. తిరుపతమ్మ కథ,  కానిస్టేబుల్ కూతురు సినిమాలు చూశారా? అందులో ఆమె నటనకు కన్నీరు పెట్టకపోతే.. మనకు మనసు లేనట్టే. అందాన్నీ.., అభినయాన్నీ.. ఆభరణాలుగా చేసుకున్న మరపురాని నటి ఆమె. 

అక్క షావుకారు జానకి పుణ్యమా అని హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత అక్కనే దాటిపోయింది. ఎన్టీయార్ తో ఏకంగా పాతిక సినిమాల్లో కథానాయికగా నటించింది. తెలుగు సినిమాను గ్లామర్ పరంగా మరో అడుగేయించింది. అలాంటి మహానటి ిఇప్పుడు మనల్ని వదిలి వెళ్లడం బాధాకరం. ఆ మహానటి ఆత్మకు శాంతి చేకూరలని భగవంతుడ్ని ప్రార్థిద్దాం. 

వెండితెరపై ఎప్పటికీ మాసిపోని సంతకం కృష్ణకుమారి 
శిల్పి మదిలో కల్పనా శిల్పం కృష్ణకుమారి.. 
చిత్రకారుని భావనా చిత్రం కృష్ణకుమారి
కవి కలల్లో కదిలేటి కావ్యం కృష్ణకుమారి. . 
రాగరంజిత ప్రణయ స్వరూపం కృష్ణకుమారి....
ఇలపై కదిలిన పలుకుల జాబిలి కృష్ణకుమారి..
 
ఆ అభినయ దేవతకు  కన్నీటి వీడ్కోలందిస్తోందీ... ‘తెలుగువన్’

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com