
తమిళ సినీ పరిశ్రమలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటివరకు బాక్సాఫీస్‌ను శాసించిన అగ్ర హీరోల సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా కోలీవుడ్ బాక్సాఫీస్ చక్రవర్తిగా వెలుగొందిన దళపతి విజయ్ (Thalapathy Vijay) తన 34 ఏళ్ల సినీ ప్రస్థానానికి స్వస్తి పలికారు. ఆయన నటించిన చివరి చిత్రం 'జననాయగన్' విడుదలకు సిద్ధమవుతోంది.
విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించడం కోలీవుడ్‌లో ఒక పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. ప్రతి ఏటా థియేటర్ల మొత్తం వసూళ్లలో దాదాపు 20 శాతం నుండి 23 శాతం వరకు వాటాను ఒంటరిగా సాధించే విజయ్ మార్కెట్ ఇప్పుడు ఖాళీ అయింది. ఈ భారీ మార్కెట్‌ను దక్కించుకోవడానికి సరైన హీరో కోసం పరిశ్రమ ఎదురుచూస్తున్న తరుణంలో అందరి దృష్టి స్టార్ హీరో సూర్య (Suriya) వైపు మళ్లింది.
తమిళ ఇండస్ట్రీలోని మిగిలిన సీనియర్ స్టార్ల పరిస్థితి కూడా సూర్యకు అనుకూలంగా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ వయస్సు రీత్యా మునుపటిలా వరుస పెట్టి భారీ సినిమాలు చేయడం కష్టంగా మారింది. ఇక మరో అగ్ర నటుడు అజిత్ కుమార్ విషయానికి వస్తే, ఆయనకు కేవలం సినిమాలే కాకుండా బైక్ రేసింగ్, ఇతర వ్యక్తిగత వ్యాపకాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటోంది. పైగా రెమ్యునరేషన్ ఎక్కువ కావడం, ఇతర భాషల్లో మార్కెట్ విస్తరణపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్ల అజిత్ రేసులో వెనుకబడ్డారు. దీనితో కోలీవుడ్‌లో నంబర్ వన్ స్థానాన్ని అధిరోహించడంతో పాటు, పాన్ ఇండియా మార్కెట్‌ను శాసించేందుకు సూర్యకు లైన్ క్లియర్ అయింది.
సూర్య క్రేజ్ కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ అసాధారణమైనది. గతంలో 'గజిని', 'సింగం' సిరీస్ చిత్రాలతో అలరించిన సూర్యకు ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. పైగా ఇప్పుడు 'కరుప్పు'తో కమ్ బ్యాక్ కూడా ఇచ్చారు. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సూర్యకు 'కరుప్పు' కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందించింది. దీంతో ఒక్కసారిగా సూర్య అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో దళపతి విజయ్‌తో సినిమాలు చేయాలని కథలు సిద్ధం చేసుకున్న కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు, స్టార్ డైరెక్టర్లు ఇప్పుడు తమ రూట్‌ను మార్చారు. విజయ్ డేట్స్ కోసం ఎదురుచూసిన వారంతా లైన్ కట్టి సూర్యను సంప్రదిస్తున్నారు. దీనికి తోడు టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు సైతం సూర్య కాల్షీట్ల కోసం భారీ మొత్తంలో అడ్వాన్సులు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సూర్య చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే 'ఆవేశం' ఫేమ్ జీతూ మాధవన్ డైరెక్షన్‌లో తన 47వ సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయం సాధిస్తే, కోలీవుడ్ తదుపరి సుప్రీం పవర్‌గా సూర్య అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది.






