Home

»

Latest News

Keerthy Suresh: 'సత్యవాన్ సావిత్రి' రిలీజ్ డేట్ ఫిక్స్.. సతీ సావిత్రి కథతో మహానటి!

Jun 17, 2026 1:12PM

మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడమే కాకుండా, దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh). కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త కోర్టు రూమ్ డ్రామా థ్రిల్లర్ 'సత్యవాన్ సావిత్రి' (Sathyavan Savithiri). వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను జూలై 24న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మహాభారతంలోని పౌరాణిక గాథ అయిన సావిత్రి తన భర్త సత్యవంతుడి ప్రాణాలను యమధర్మరాజు నుండి ఎలా కాపాడుకుందనే కథ అందరికీ తెలిసిందే. ఆ పురాతన కథను నేటి ఆధునిక కాలానికి అన్వయిస్తూ, ఒక భార్య తన భర్త కోసం చేసే చట్టపరమైన పోరాటంగా ఈ చిత్రాన్ని మలిచారు. నూతన దర్శకుడు ప్రవీణ్ ఎస్. విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో మానసిక సంఘర్షణలు, ఆవేదనలను ఎదుర్కొంటూనే, న్యాయం కోసం కోర్టులో పట్టుదలతో పోరాడే ఒక పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించబోతోంది. సమాజంలో చట్టానికి, నైతికతకు మధ్య జరిగే ఈ లీగల్ బ్యాటిల్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.

ఇందులో సీనియర్ దర్శకుడు, నటుడు మిస్సిన్ కీలకమైన సీనియర్ అడ్వొకేట్ పాత్రలో నటిస్తూ కీర్తి సురేష్‌తో తలపడనున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే కోర్టు రూమ్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఈ హై-వోల్టేజ్ లీగల్ థ్రిల్లర్ చిత్రాన్ని జీ స్టూడియోస్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వేదికక్కారన్‌పట్టి ఎస్. శక్తివేల్, ఉమేష్ కుమార్ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నారు. చారుకేష్, బాల శరవణన్, శిల్పా మంజునాథ్, బాలాజీ శక్తివేల్, ఆర్. సుందర్‌రాజన్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కాబోతున్న ఈ కోర్టు రూమ్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com