
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' (Vishwambhara). షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి భారీ అంచనాలను మోస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఒక షాకింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుండి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో వశిష్ట దర్శకత్వంలో వచ్చిన 'బింబిసార' చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించిన కీరవాణి, 'విశ్వంభర' కోసం కూడా పని చేయాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం. కీరవాణి స్థానంలో ఇప్పుడు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గౌర హరిని చిత్ర బృందం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గౌరహరి ఇప్పటికే 'హనుమాన్' వంటి సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించి తన ప్రతిభను చాటుకున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. వీఎఫ్ఎక్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష నటిస్తున్నారు. గౌర హరి రాకతో సినిమాకు కొత్త రకమైన సంగీతం అందుతుందని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని జులై 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.






