Home

»

Latest News

Chiranjeevi: చంద్రబాబు చేసిన సాయం మర్చిపోయారా?.. చిరంజీవిపై కాట్రగడ్డ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్!

Mar 23, 2026

  • దుమారం రేపిన చిరంజీవి కామెంట్స్ 
  • ప్రొడ్యూసర్ కాట్రగడ్డ ప్రసాద్ మెగా కౌంటర్
  • అప్పుడు ఎందుకు నోరు మెదపలేదని సూటి ప్రశ్న

ఇటీవల గద్దర్ అవార్డుల వేదికపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో దుమారాన్ని రేపాయి. సినీ కళాకారులను ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్‌ వెనకబడిపోయిందని, నంది అవార్డులను పునరుద్ధరించాలని చిరంజీవి కోరారు. మెగాస్టార్ మాట్లాడిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

తాజాగా ఈ ఇష్యూపై సీనియర్ ప్రొడ్యూసర్ కాట్రగడ్డ(Katragadda Prasad) ప్రసాద్ స్పందించారు. 'తెలుగువన్ సినిమా'తో ఆయన మాట్లాడుతూ చిరంజీవి తీరుని తప్పుబట్టారు. ఒకరిని విమర్శించే ముందు గతాన్ని గుర్తుంచుకోవాలని, గతంలో చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమకు చేసిన మేలును ఎవరూ మర్చిపోకూడదని ఆయన హితవు పలికారు. 

హాట్ టాపిక్ గా కాట్రగడ్డ కామెంట్స్
హైదరాబాద్‌లో నేడు హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇంతలా సెటిల్ అయ్యారంటే దానికి చంద్రబాబు వేసిన పునాదులే కారణమని కాట్రగడ్డ ప్రసాద్ గుర్తు చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో హీరోల ఇళ్లు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వంటి సంస్థలకు స్థలాలు దక్కడం వెనుక చంద్రబాబు కృషి ఉందని పేర్కొన్నారు. "అంతటి సహాయం చేసిన చంద్రబాబు అక్రమంగా అరెస్ట్ అయినప్పుడు, ఈ ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు నోరు మెదపలేదు?" అని ఆయన ప్రశ్నించారు.

బహిరంగ వేదికపై ఎందుకు?
సినిమా టిక్కెట్ల ధరల పెంపు కోసం ప్రభుత్వాల చుట్టూ తిరిగే పెద్దలు, పరిశ్రమ అభివృద్ధి కోసం లేదా ఏపీలో స్టూడియోల నిర్మాణం కోసం ఎందుకు ముందుకు రావడం లేదని కాట్రగడ్డ నిలదీశారు. ఏదైనా చెప్పాలనుకుంటే చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ద్వారా లేదా నేరుగా ముఖ్యమంత్రిని కలిసి అడగవచ్చని, కానీ బహిరంగ వేదికలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

చిన్న నిర్మాతల గోడు పట్టదా?
కేవలం పెద్ద సినిమాల గురించే కాకుండా, నష్టాల్లో ఉన్న చిన్న నిర్మాతల గురించి ఏ రోజైనా ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడారా? అని ప్రసాద్ ప్రశ్నించారు. ఓటీటీ నిబంధనలు, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుదల వంటి అంశాలపై హీరోలు ఎందుకు స్పందించరని ఆయన ధ్వజమెత్తారు. ఏపీలో షూటింగ్ లొకేషన్లు ఎన్నో ఉన్నా, అక్కడికి వెళ్లి పరిశ్రమను డెవలప్ చేసే ఆలోచన ఎందుకు చేయడం లేదని అడిగారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఐటీ ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చారు కానీ, సినిమా వాళ్లు కనీసం ఒక మీటింగ్ కూడా పెట్టలేదని ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ నంది అవార్డుల వివాదం మునుముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com