Home

»

Latest News

Karuppu: సూర్య 'కరుప్పు' మూవీ లీక్.. నష్టపరిహారం కోరుతున్న నిర్మాత!

May 14, 2026 5:59PM

సూర్య (Suriya), త్రిష (Trisha) ప్రధాన పాత్రల్లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన 'కరుప్పు' (Karuppu) చిత్రం విడుదలకు ముందే అనూహ్యమైన చిక్కుల్లో పడింది. ఆర్థిక కారణాలతో సినిమా విడుదల వాయిదా పడినప్పటికీ, ఒక థియేటర్లో నిర్మాత అనుమతి లేకుండానే ప్రదర్శన జరగడం ఇప్పుడు కోలీవుడ్‌లో పెను సంచలనంగా మారింది. ఈ సెక్యూరిటీ వైఫల్యంపై చిత్ర నిర్మాత తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

సినిమా ఇంకా అధికారికంగా విడుదల కాకముందే, పూణేలోని ఒక థియేటర్లో 'కరుప్పు' సినిమా షో ప్రదర్శితమైంది. సాధారణంగా థియేటర్లకు డిజిటల్ కీ (KDM) పంపేటప్పుడు నిర్మాత అనుమతి తప్పనిసరి. కానీ, నిర్మాత అనుమతి లేకుండానే క్యూబ్ (Qube) సంస్థ ఈ డిజిటల్ కీని జారీ చేయడంతో అక్కడ ప్రదర్శన సాగింది. సుమారు గంట పాటు సినిమా ప్రదర్శించబడిన తర్వాత చిత్ర యూనిట్ అప్రమత్తమై దానిని నిలిపివేసింది.

ఈ ఘటనపై నిర్మాత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దీనికి బాధ్యత వహిస్తూ క్యూబ్ సంస్థ తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా నిర్మాతకు మద్దతుగా నిలిచింది.

గంట సేపు సినిమా ప్రదర్శితం కావడంతో, ఆ సమయంలో ఎవరైనా సినిమాను రికార్డ్ చేసి ఉండవచ్చని చిత్ర బృందం ఆందోళన చెందుతోంది. గతంలో 'జననాయగన్' సినిమాకు ఎదురైనట్టే, ఈ చిత్రం కూడా ఆన్‌లైన్‌లో లీక్ అవుతుందేమోనన్న భయం నిర్మాతలను వెంటాడుతోంది. డిజిటల్ సినిమా టెక్నాలజీ ప్రొవైడర్ల నుండి ఇలాంటి పొరపాటు జరగడం పట్ల మేకర్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఎదురవుతున్న ఆర్థిక పరమైన అడ్డంకులను తొలగించుకునే పనిలో చిత్ర యూనిట్ నిమగ్నమైంది. ఫైనాన్షియర్లతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఈ రాత్రికి అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 'కరుప్పు' చిత్రం రేపు (శుక్రవారం) థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో విడుదల కానుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com