జూనియర్ మూవీ రివ్యూ
on Jul 17, 2025

సినిమా పేరు: జూనియర్
తారాగణం: కిరీటి, శ్రీలీల, జెనీలియా,రవిచంద్రన్, రావు రమేష్, శ్రీ హర్ష, సత్య తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఫొటోగ్రఫీ : కె. కే సెంథిల్ కుమార్
యాక్షన్ : పీటర్ హెయిన్స్
ఎడిటర్: నిరంజన్ దేవర మన్నే
రచన, దర్శకత్వం: రాధాకృష్ణ రెడ్డి
నిర్మాత: రజనీ కొర్రపాటి
బ్యానర్:వారాహి చలన చిత్రం
విడుదల తేదీ: జూలై 18 ,2025
తెలుగు సినిమా ప్రేక్షకుల్లో 'వారాహి'సంస్థ నుంచి వచ్చే సినిమాలంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ కోవలోనే నేడు 'జూనియర్'(Junior)మూవీ థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. నూతన కథానాయకుడు కిరీటి(Keeriti)శ్రీలీల(Sreeleela)జంటగా నటించగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ (Devisriprasad) సంగీతాన్ని అందించాడు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం
కథ
అభి (కిరీటి) చదువులో టాపర్ అయినా కూడా, యూత్ గా ఉన్నప్పుడే లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలని, ఆ మెమొరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండాలని భావించే చురుకైన యువకుడు.రేపు అనేది కాదు ఈ రోజే ఇంపార్టెంట్ అనే ఫిలాసఫీ తో ఉంటాడు. కానీ అభి వాళ్ళ తల్లితండ్రులకి లేటు వయసులో పుట్టడం వలన తండ్రి కోదండపాణి(రవిచంద్ర) ఎంతో గారాబం చేస్తు, అభి కి సంబంధించిన ప్రతి విషయలోను ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. ఇది నచ్చని అభి తండ్రికి దూరంగా తనకి నచ్చినట్టు ఉంటాడు. స్ఫూర్తి (శ్రీలీల) భవిష్యత్తు బాగుండాలని చాలా సిస్టమేటిక్ గా లైఫ్ ని జర్నీ చేస్తుంటుంది. స్ఫూర్తి, అభి ఒకరికొకరు ఇష్టపడతారు. ఇద్దరు కలిసి 'రైజ్ సొల్యూషన్స్' అనే ఒక బడా మల్టీనేషనల్ కంపెనీ లో జాబ్ సంపాదిస్తారు. ఆ కంపెనీ 'సిఈఓ' (రావు రమేష్) తన తర్వాత సిఈఓ గా కూతురు విజయ సౌజన్య(జెనీలియా) ని అనౌన్స్ చేస్తాడు. కానీ ఆమె సొంత కూతురు కాదు. విజయ సౌజన్య సిఈఓ అవ్వకూడదని అభి అడ్డుకుంటుంటాడు. ఈ నిజం విజయ సౌజన్య కి కూడా తెలుస్తుంది. అభికి విజయ సౌజన్య సొంత ఊరు విజయనగరానికి సంబంధించిన నిజం ఒకటి తెలుస్తుంది. దాంతో విజయ సౌజన్య విషయంలో అభి ఒక నిర్ణయానికి వస్తాడు. అభికి విజయ సౌజన్య గురించి తెలిసిన నిజం ఏంటి? విజయ సౌజన్య సిఈఓ కాకూడదని అభి ఎందుకు అనుకున్నాడు? అభి విషయంలో విజయ సౌజన్య నిర్ణయం ఏంటి? విజయ సౌజన్య తల్లి తండ్రులు ఎవరు? అసలు విజయనగరానికి సంబంధించిన రహస్య ఏంటి? చివరకి ఎవరి క్యారక్టర్ ఎలా ముగిసిందనేదే ఈ చిత్ర కథ
ఎనాలసిస్
కథగా చెప్పుకుంటే మంచి కథే కానీ కథనంలో ఎన్నో లోపాలతో జూనియర్ తెరకెక్కింది. నలభై ఐదు, నలభై ఆరు వయసు గల తల్లి తండ్రులకి కొడుకు ఉండటంలో విచిత్రం ఏముంటుంది. పైగా ప్రస్తుత జనరేషన్ లో ముప్పై దాటితే కానీ పెళ్ళి చేసుకోవడం లేదు. కాబట్టి అభి తండ్రి క్యారక్టర్ ని ఇంకొంచం ఏజ్ బార్ వ్యక్తిగా చూపించాల్సింది.హెయిర్ కూడా తెల్ల జుట్టుని ఉపయోగించాల్సింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే అభి ఇంట్రడక్షన్ సూపర్ గా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సదరు యాక్షన్ సన్నివేశం లో అభి పెర్ ఫార్మెన్స్ కూడా సూపర్ గా ఉంది, ఈ మధ్య కాలంలో యూత్ సినిమాల్లో అలాంటి యాక్షన్ ఎపిసోడ్ రాలేదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అభి క్యారక్టర్ నడిచిన విధానం గాని, అభి చెప్పిన ఫిలాసఫీ, ఫ్రెండ్స్ తో వచ్చిన సీన్స్ ఫ్రెష్ గా ఉండటంతో పాటు నవ్వుల్నీ కూడా పూయించాయి,. స్ఫూర్తి, అభి మధ్య వచ్చే లవ్ సీన్స్ మాత్రం పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. మూవీలో ఏముంది అనుకునే టైం లో విజయ సౌజన్య క్యారక్టర్ ని ప్రవేశించారు. కాకపోతే ఈ క్యారక్టర్ ని ముందుగానే ఎంటర్ చేసి ఉండుంటే బాగుండేది. విజయనగరం అనే ఊరిలో తనకి కావాల్సిన వాళ్ళ కోసం ఎంక్వయిరీ చేస్తుందనేది చూపించాల్సింది. దీంతో ప్రేక్షకుల్లో కథ పై క్యూరియాసిటీ కలిగేది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుండటంతో పాటు, సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీ కూడా వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ కొత్తగా ఉండదు. ఆ కథ మొత్తం మనకి సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ మూవీస్ శ్రీమంతుడు, మహర్షి సినిమాలని గుర్తుకు తెస్తుంది. ఆ విధంగా కాకుండా కథ కి చాలా ముఖ్యమైన రెండు పాయింట్స్ పై సెకండ్ హాఫ్ ని ట్రావెల్ చెయ్యాల్సింది. ఊరు విషయం కావడం వలన కొత్త సన్నివేశాలు రాసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ కథ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ ని మధ్యలోనే ఇచ్చి, ఆ తర్వాత అభి తో సీరియస్ గా ఉన్న కథని ఎంటర్ టైన్ మెంట్ లోకి మారుస్తానని చెప్పించాల్సింది. అభి క్యారక్టరయిజేషన్ కూడా ఇదే. ఆ విధంగా సెకండ్ హాఫ్ మొత్తం ఎంటర్ టైన్ మెంట్ గా నడిపిస్తూ, ఒక బలమైన విలన్ క్యారక్టర్ ని సెట్ చేసి ఉంటే సినిమా లుక్ మారిపోయేది. శ్రీలీల సెకండ్ హాఫ్ లో కనిపించకపోవడం మైనస్. కాకపోతే వైరల్ సాంగ్ మాత్రం చాలా బాగుంది.క్లైమాక్స్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. విజయ దుర్గ క్యారక్టర్ ని ఇంకా పెంచాల్సింది. యాక్షన్ సన్నివేశాలు మాత్రం బాగున్నాయి
నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు
అభి క్యారెక్టర్ లో కిరీటి ఎంతో అనుభవమున్న హీరోలా విజృంభించి నటించాడు. ముఖ్యంగా డాన్స్ లు ఒక లెవల్లో చేసాడు. తన అభిమాన హీరో ఎన్టీఆర్ అని చెప్పినట్టుగానే కొన్ని కొన్ని స్టెప్స్ లో ఎన్టీఆర్ ని మరిపించేలా డాన్స్ చేసాడు. ముఖ్యంగా వైరల్ సాంగ్ లో మాస్ స్టెప్స్ అదరహో. శ్రీలీల నటనలో పెద్దగా మెరుపులు లేకపోయినా ఉన్నంతలో బాగానే చేసింది. జెనీలియా చాలా సంవత్సరాల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టినా, తన నటనలో సత్తా తగ్గలేదని నిరూపించింది. రవిచంద్రన్, రావు రమేష్ కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఇక సెంథిల్ కుమార్ ఫొటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కవే అవుతుంది. ప్రతి ఫ్రేమ్ ని ఎంతో కలర్ ఫుల్ గా నింపి 'జూనియర్' కి సరికొత్త బలాన్ని ఇచ్చాడు. దేవి మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. రాధాకృష్ణ రెడ్డి దర్శకుడిగా సక్సెస్ అయినా, రచయితగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. డైలాగ్స్ లో కూడా మెరుపులేం లేవు. వారాహి నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే కథ కొత్తగానే ఉన్నా, మేకర్స్ ఆ కథ ని చెప్పే విధానంలో, కథనం విషయంలో, క్యారెక్టర్స్ యొక్క తీరు తెన్నుల్లో మరింత శ్రద్ధ చూపించాల్సింది. కిరీటి ఎనర్జీ, డాన్స్, సెంథిల్ కుమార్ ఫొటోగ్రఫీ జూనియర్ కి ప్లస్.
Rating 2.5/5
అరుణాచలం
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



