Home

»

Latest News

Jr NTR: 4 లక్షల నుండి గ్లోబల్ స్టార్ వరకు.. జూనియర్ ఎన్టీఆర్ 25 ఏళ్ళ ప్రస్థానం!

May 23, 2026 11:17AM

తెలుగు చిత్రసీమలో ఒక శకం మొదలై నేటికి సరిగ్గా 25 ఏళ్ళు పూర్తయింది. నందమూరి వంశం నుండి వచ్చిన ఒక 17 ఏళ్ళ కుర్రాడు, తన తాతగారి పోలికలతో వెండితెరపై మొదటిసారి కథానాయకుడిగా అడుగుపెట్టిన రోజు అది. అవును, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా నటించిన మొదటి చిత్రం 'నిన్ను చూడాలని' (Ninnu Choodalani) 2001 మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేటితో ఆ సినిమా విడుదలై పాతికేళ్లు, అంటే ఒక రజతోత్సవ కాలం ముగిసింది. 

దివంగత రామోజీ రావు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై, వి.ఆర్. ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం ద్వారా హీరోగా ఎన్టీఆర్ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ అందించిన సంగీతంలో 'ఊపిరొచ్చిన బాపు బొమ్మ', 'ఏ చోట నేనున్నా' వంటి పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ సినిమాలో తారక్ చూపించిన హావభావాలు, నటనలోని ఈజ్ చూసి, పరిశ్రమకు ఒక గొప్ప నటుడు దొరికాడని సినీ విశ్లేషకులు ఆనాడే జోస్యం చెప్పారు.

ఆ తర్వాత అదే 2001 సంవత్సరంలో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'స్టూడెంట్ నెం.1' చిత్రంతో తారక్ తన మొదటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆపై వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'ఆది', మళ్లీ రాజమౌళితో చేసిన 'సింహాద్రి' చిత్రాలతో సృష్టించిన ప్రభంజనం టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డులను తిరగరాసింది. కేవలం 20 ఏళ్ళ వయసులోనే మాస్ కమర్షియల్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఏకైక హీరోగా ఎన్టీఆర్ రికార్డు సృష్టించారు. 

అపజయాలు ఎదురైనా కుంగిపోకుండా, ప్రతి సినిమాకూ తనను తాను మార్చుకుంటూ, నటనలో సరికొత్త శిఖరాలను అధిరోహించారు. 'రాఖీ' సినిమాలో తారక్ చూపించిన భావోద్వేగాలు, 'యమదొంగ'లో యముడిగా ఆయన చెప్పిన డైలాగులు నటుడిగా ఆయనలోని విశ్వరూపాన్ని చూపించాయి. ముఖ్యంగా 'యమదొంగ' కోసం ఆయన బరువు తగ్గి సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత 'అదుర్స్'లో 'చారి'గా ఆయన చేసిన కామెడీ టైమింగ్, 'బృందావనం'లో క్లాస్ లుక్ ఆయనలోని ఆల్ రౌండర్‌ను పరిచయం చేశాయి.

కొన్ని పరాజయాల తర్వాత తారక్ తన కథల ఎంపికను పూర్తిగా మార్చుకున్నారు. పూరీ జగన్నాథ్ 'టెంపర్' (2015) సినిమాతో తారక్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఆ తర్వాత 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత వీర రాఘవ' వంటి వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు.

ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాతో తారక్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో ఆయన ప్రదర్శించిన నటన అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. 'నాటు నాటు' పాటకు ఆయన వేసిన స్టెప్పులు ఆస్కార్ వేదికపై మార్మోగాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత వచ్చిన 'దేవర: పార్ట్ 1' (2024), బాలీవుడ్ డెబ్యూ మూవీ 'వార్ 2' (2025)లతో ఆయన గ్లోబల్ స్టార్‌గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు.

నవ రసాలను అద్భుతంగా పండించగల అతికొద్ది మంది స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. 2001లో ఒక సాధారణ యువకుడిగా 'నిన్ను చూడాలని' అంటూ కెరీర్ మొదలుపెట్టి, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల గుండెల్లో నిలిచారు. తొలి సినిమా కోసం ఆనాడు కేవలం 4 లక్షల రూపాయల పారితోషికాన్ని అందుకున్న ఎన్టీఆర్.. నేడు ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాప్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగారు. 25 ఏళ్ల ఈ సుదీర్ఘ, అద్భుతమైన సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అభినందనలు! భవిష్యత్తులో ఆయన మరెన్నో మైలురాళ్లను అందుకోవాలని ఆశిద్దాం.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com