
కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ కీ రోల్స్ పోషించిన మూవీ జెట్ లీ(Jetlee). మే 1, 2026 న విడుదలైన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రానికి 'మత్తు వదలరా' మూవీతో కొత్త రకం క్రేజీ హ్యూమర్‌ని పరిచయం చేసిన డైరెక్టర్ రితేష్ రానా దర్శకుడు. ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి ప్రియులని అలరించడానికి సిద్దమయ్యింది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం "జియో హాట్‌స్టార్" (Jio Hotstar) స్ట్రీమింగ్ హక్కులని సొంతం చేసుకుంది. ఈ నెల 25 నుంచి అంటే ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదట ఈ సినిమాను ఒకే భాషలో విడుదల చేస్తారని వార్తలు వచ్చినా, తాజాగా తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ చిత్ర కథాంశం మొత్తం దాదాపుగా ఒక విమానంలోనే సాగుతుంది. ప్రజాపతి అనే ఒక బడా బిజినెస్‌మ్యాన్ ప్రజలు తమ బ్యాంకులో దాచుకున్న దాదాపు 15 వేల కోట్ల రూపాయల భారీ నిధులని వేరే చోట ఇన్వెస్ట్ చేసి ఘోరంగా నష్టపోతాడు. ఈ 15,000 కోట్ల భారీ బ్యాంకింగ్ స్కామ్ బయటపడటంతో బాధితులంతా రోడ్లపైకి వచ్చి ధర్నాలు మొదలుపెడతారు. దీంతో కేంద్ర హోం మంత్రి మేల్కోటి వెంటనే స్పందించి, ప్రజాపతిని అరెస్ట్ చేసి తిరిగి దేశానికి రప్పించే బాధ్యతని భారత ఇంటెలిజెన్స్ విభాగానికి అప్పగిస్తారు. ఈ హై-రిస్క్ మిషన్ కోసం స్పెషల్ ఏజెంట్ శివానీ రాయ్‌ను రంగంలోకి దించుతారు. అయితే, ఈ స్కామ్‌లో భాగమైన జజీరా సిండికేట్ మరియు ఇతర శత్రువుల నుండి తన ప్రాణాలకు ముప్పు ఉందని గ్రహించిన ప్రజాపతి, తానే స్వయంగా లొంగిపోయినట్లు నటిస్తూనే, ఆ తర్వాత ఎలాగైనా తప్పించుకోవాలని ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు.
దుబాయ్ నుండి కొచ్చికి ఒక ప్రత్యేక విమానంలో ప్రజాపతిని తీసుకువస్తున్న తరుణంలో, అతడిని చంపడానికి ఒక ముఠా, ప్రాణాలతో అపహరించడానికి మరో ముఠా రంగంలోకి దిగుతాయి. ఇలా విమానం గాల్లో ఉండగానే తీవ్ర ఉత్కంఠ, గందరగోళం నెలకొంటుంది. సరిగ్గా అదే సమయంలో, తన గతాన్ని పూర్తిగా మర్చిపోయిన స్థితిలో డాక్టర్ వేదవ్యాస్ అలియాస్ జాన్ సీనా అనే విచిత్రమైన పాత్ర ఆ విమానంలోకి ఎంట్రీ ఇస్తుంది. గతం లేని ఈ అమాయక డాక్టర్ క్యారక్టర్ ని విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది రకరకాల ప్రొఫెషనల్స్‌గా పొరబడుతుంటారు. ఈ గందరగోళం మధ్య ప్రజాపతి వేసిన ఎస్కేప్ ప్లాన్‌ను వేదవ్యాస్ ఎలా తలకిందులు చేశాడు, శత్రువుల దాడులను అతడు ఎలా అడ్డుకున్నాడు అనేదే ఈ సినిమా అసలు కథ.
Also read: Samantha: సమంతకి విజయ్ షాక్!
క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) నిర్మించిన ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ సమర్పకులుగా వ్యవహరించారు. మిస్ యూనివర్స్ ఇండియా 2024' రియా సింఘా హీరోయిన్‌గా చేయగా,వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, కబీర్ దుహాన్ సింగ్ మరియు గెటప్ శ్రీను వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. కాలభైరవ అందించిన సంగీతం, ముఖ్యంగా 'టర్బులెన్స్', 'సత్య ఈజ్ నాట్ జెట్ లీ' వంటి సాంగ్స్ వినోదాన్ని పంచాయి. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకోగా మరి ఓటిటి వేదికగా ఈ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.





