
టాలీవుడ్ సహజ నటి జయసుధ (Jayasudha) తాజాగా 'రమణి కళ్యాణం' (Ramani Kalyanam) చిత్ర టీజర్ లాంచ్ వేడుకలో పాల్గొని చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. సూర్య వశిష్ట, దీప్షికా చంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ప్రస్తుతం సమాజంలో మారుతున్న మానవ సంబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో 'రమణి కళ్యాణం' చిత్రాన్ని దర్శకుడు విజయ్ అదిరెడ్డి తెరకెక్కించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన జయసుధ టీజర్‌ను విడుదల చేసి తన మనసులోని మాటను పంచుకున్నారు.
"సినిమా అంటే కేవలం రంగులు, హంగులు మాత్రమే కాదు.. మనుషుల మధ్య ఉండే ప్రేమాభిమానాలను ప్రతిబింబించేలా ఉండాలి. 'రమణి కల్యాణం' టీజర్ చూస్తుంటే ఆ ఫీల్ కనిపిస్తోంది. చిన్న సినిమాలే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలను అందుకుంటున్నాయి. ఈ సినిమా కూడా అదే బాటలో పయనిస్తుందని ఆశిస్తున్నాను" అని జయసుధ పేర్కొన్నారు.
ఈ చిత్రంలో కొత్త తరం నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను జయసుధ అభినందించారు. సినిమాటోగ్రఫీ బాగుందని కొనియాడారు. అలాగే హీరో సూర్య వశిష్ట, హీరోయిన్ దీప్షిక తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారని ఆమె తెలిపారు. 54 ఏళ్ల సినీ ప్రయాణం నాది.. కొత్త తరంతో కలిసి ఇలా సినిమా వేడుకలో పాల్గొనడం బ్లెస్సింగ్ అని జయసుధ అన్నారు.
శ్రీనివాస రెడ్డి, చైతు జొన్నలగడ్డ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు. సూరజ్ ఎస్ కురుప్ అందించిన సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ హార్ట్ టచింగ్ డ్రామా మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.





