
సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, వారి వైవాహిక బంధాల్లో వచ్చే విభేదాలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా టాలెంటెడ్ నటుడు రవి మోహన్ (జయం రవి) తన వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న తీవ్రమైన ఒడిదుడుకుల కారణంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్య ఆర్తీతో సాగుతున్న విడాకుల వివాదం పూర్తిగా సమసిపోయేంత వరకు తాను నటనకు, సినిమాలకు తాత్కాలికంగా గుడ్‌బై చెబుతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చిన ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎంతో బాధతో తాను ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా చక్కదిద్దుకున్న తర్వాతే మళ్లీ వెండితెరపైకి క్లీన్‌గా తిరిగి వస్తానని ఆయన స్పష్టం చేశారు.
తన భార్య ఆర్తీ తనపై సైబర్ బుల్లింగ్ ముఠాలను ప్రయోగించి, సమాజంలో తనకున్న ఇమేజ్‌ను, గౌరవాన్ని పాడుచేయడానికి ప్రయత్నిస్తోందని రవి మోహన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకప్పుడు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న సొంత ఇంటిని, ఆస్తులన్నింటినీ వారి కోసమే వదిలేసి, కేవలం కట్టుబట్టలతో నాలుగు సంవత్సరాల క్రితమే తాను ఆ ఇంటి నుండి బయటకు వచ్చేసానని ఆయన గుర్తుచేసుకున్నారు. కనీస గౌరవం దక్కని చోట తాను ఉండలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. సింగర్, స్పిరిచువల్ హీలర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో తనకు ఉన్న స్నేహాన్ని అడ్డం పెట్టుకుని, తన క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 45 ఏళ్ల వయసున్న నటుడిగా రోజువారీ జీవితంలో ఎందరో అందమైన హీరోయిన్లతో కలిసి నటిస్తుంటానని, ఎవరి అందం కోసమో తాను ఎవరి వెనకాలో వెళ్లాల్సిన అవసరం లేదని రవి మోహన్ ఘాటుగా సమాధానమిచ్చారు.
తాను ఎప్పుడూ మహిళల హక్కులను గౌరవించే వ్యక్తిని (ఫెమినిస్ట్) అని, ఇప్పటివరకు తన భార్య లేదా కుటుంబానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని ఆయన అన్నారు. అయితే తన పిల్లలకు దక్కాల్సిన కనీస స్వేచ్ఛను కూడా హరిస్తూ, వారి ఫోన్లను లాక్కుని కనీసం తనతో మాట్లాడనివ్వడం లేదని చెబుతూ రవి మోహన్ మీడియా ముందే కన్నీరు పెట్టారు.
తనకు సొంతంగా కనీసం ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేదని, భార్యతో ఉన్న జాయింట్ అకౌంట్ వల్ల తాను రూపాయి లేకుండా రోడ్డున పడ్డానని ఆవేదన చెందారు. ఈ మానసిక క్షోభ కారణంగా గత ఆరు నెలలుగా తాను ఎలాంటి సినిమాల్లో నటించలేకపోయానని తెలిపారు. తన బాధను అర్థం చేసుకున్న కెనీషా కూడా ఈ సైబర్ బుల్లింగ్ వేధింపులు తట్టుకోలేక చెన్నై వదిలి వెళ్లిపోయిందని, తన జీవితాన్ని నరకం చేసిన వారిని తాను అస్సలు వదిలిపెట్టనని ఆయన హెచ్చరించారు. అలాగే ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ నటి కూడా తన విషయాల్లో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలని ఆయన ఘాటుగా హెచ్చరించడం సంచలనంగా మారింది.
ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నానని, ఈ మానసిక ఒత్తిడి వల్ల సినిమాలపై అస్సలు దృష్టి పెట్టలేకపోతున్నానని రవి అన్నారు. ఇప్పటివరకు తన పిల్లల భవిష్యత్తు కోసమే తాను మౌనంగా ఉన్నానని, ఈ కేసును ఒక్క రోజులోనే ముగించే సత్తా తనకు ఉందని చెప్పారు. ఇకపై తాను మౌనంగా ఉండే ప్రసక్తే లేదని, తన వద్ద ఉన్న అన్ని నిజమైన ఆధారాలను కోర్టు ముందు ఉంచి, ఈ విడాకుల వివాదానికి త్వరలోనే ముగింపు పలుకుతానని స్పష్టం చేశారు. అవసరమైతే ఆర్తీ కుటుంబ సభ్యుల్లో కొందరు కూడా తన తరుపున మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ ఇద్దరి మధ్య వివాదం ఇప్పుడు ముదిరి పాకాన పడటంతో సినీ వర్గాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.





.webp)
