Home

»

Latest News

బాలీవుడ్‌లో చేస్తే గ్లామర్‌.. టాలీవుడ్‌లో చేస్తే వివాదమా? జాన్వీ కామెంట్స్‌తో మరోసారి చర్చ!

Oct 30, 2026 12:15PM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల గ్లామర్‌ పాత్రలు, ఎక్స్‌పోజింగ్‌ సన్నివేశాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా బాలీవుడ్‌లో కథానాయికలను గ్లామరస్‌గా చూపించడం, బోల్డ్‌ సన్నివేశాల్లో నటింపజేయడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. అక్కడి సినిమాల్లో హీరోయిన్లు చేసే గ్లామర్‌ షో గురించి పెద్దగా చర్చ జరగకపోయినా, అదే అంశం దక్షిణాది సినిమాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం వివాదాలకు దారితీయడం అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది. తాజాగా రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ సినిమా విషయంలో జాన్వీ కపూర్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఇదే చర్చకు మరోసారి తెరలేపాయి.

‘పెద్ది’ సినిమాలో జాన్వీ పాత్రను చూపించిన విధానం, కొన్ని సన్నివేశాల్లో కెమెరా యాంగిల్స్‌పై అప్పట్లో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో ఈ అంశంపై స్పందించిన జాన్వీ.. ఆ సన్నివేశాల విషయంలో తాను మరింత గట్టిగా అభ్యంతరం చెప్పాల్సిందని, అవసరమైతే నో చెప్పి ఉండాల్సిందని పేర్కొంది. తనకున్న గుర్తింపును ఉపయోగించి ఆ సమయంలోనే పరిస్థితిని మార్చే ప్రయత్నం చేయాల్సిందని కూడా చెప్పింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జాన్వీ గతంలో బాలీవుడ్‌ సినిమాల్లోనూ గ్లామరస్‌ పాత్రలు, బోల్డ్‌ సన్నివేశాల్లో నటించింది. అలాంటప్పుడు తెలుగు సినిమా విషయంలోనే ఈ అంశం ఇంత పెద్ద వివాదంగా మారడం వెనుక కారణాలేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్‌లో హీరోయిన్లను గ్లామర్‌ కోణంలో చూపించే విధానం కొత్త కాదు. అక్కడి దర్శకులు కూడా తమ సినిమాల అవసరాలకు అనుగుణంగా కథానాయికలను వివిధ రకాలుగా తెరపై ఆవిష్కరిస్తుంటారు. కానీ తెలుగు సినిమా విషయానికి వచ్చేసరికి మాత్రం ఇక్కడి దర్శకులు, నిర్మాతలు హీరోయిన్లను ఎలా చూపిస్తున్నారు? వారి పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు? అనే అంశాలపై ఒక్కసారిగా చర్చ మొదలవుతుంది. ఒక సినిమా సన్నివేశాలపై విమర్శలు చేయడం తప్పు కాదు. కానీ అదే తరహా సన్నివేశాలు ఇతర పరిశ్రమల్లో ఉన్నప్పుడు ఒకలా, టాలీవుడ్‌లో ఉన్నప్పుడు మరోలా స్పందించడం మాత్రం ద్వంద్వ వైఖరిలా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలోనూ బాలీవుడ్‌ నుంచి వచ్చిన కొందరు హీరోయిన్లు టాలీవుడ్‌లో మంచి అవకాశాలు అందుకుని, ఇక్కడ స్టార్‌డమ్‌ సంపాదించుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లాక తెలుగు సినిమా పరిశ్రమ గురించి, ఇక్కడి దర్శకులు, నిర్మాతలు, హీరోల గురించి విమర్శనాత్మకంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి వ్యాఖ్యలన్నింటినీ ఒకే ప‌రిధిలోకి తీసుకురాలేం. ప్రతి ఒక్కరికీ తమ అనుభవాలను చెప్పుకునే హక్కు ఉంటుంది. అదే సమయంలో ఒక పరిశ్రమను విమర్శించేటప్పుడు అక్కడి పరిస్థితులను, ఇతర పరిశ్రమల్లో ఉన్న పద్ధతులను కూడా సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. జాన్వీ కపూర్‌ తన అనుభవం గురించి మాట్లాడటం ఆమె వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. కానీ ఆ వ్యాఖ్యల ఆధారంగా టాలీవుడ్‌నే ప్రత్యేకంగా తప్పుబట్టడం ఎంతవరకు సమంజసమన్నదే ఇప్పుడు చర్చించాల్సిన అంశం. మొత్తానికి ‘పెద్ది’ వివాదం మరోసారి బాలీవుడ్‌, టాలీవుడ్‌ మధ్య కనిపించే ఈ భిన్నమైన వైఖరిపై చర్చకు కారణమైంది.

 

 

[Janhvi Kapoor, Peddi Movie Controversy, Bollywood vs Tollywood, Janhvi Kapoor Koffee With Karan, Ram Charan Peddi, Tollywood Heroines, Bollywood Actresses]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com