అతిలోకసుందరి శ్రీదేవి తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆమె నటన, గ్లామర్ దశాబ్దాల పాటు టాలీవుడ్‌ను ఏలాయి. ఇప్పుడు ఆమె నటవారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కూడా టాలీవుడ్‌లో పాగా వేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన ‘అమ్మ’ సెంటిమెంట్ వైరల్‌గా మారింది. శ్రీదేవికి అప్పట్లో కలిసొచ్చిన కొన్ని కాంబినేషన్లు, ఇప్పుడు జాన్వీ కపూర్‌కు కూడా అలాగే కుదురుతుండటంతో టాలీవుడ్ లక్కీ సెంటిమెంట్ ఇమెకు ఎంతవరకు హెల్ప్ అవుతుందనే చర్చ నడుస్తోంది.
గతంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు సరసన శ్రీదేవి ‘వేటగాడు’, ‘జస్టిస్ చౌదరి’, ‘బొబ్బిలిపులి’ వంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్లలో కథానాయికగా మెరిశారు. కట్ చేస్తే.. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా ఎన్టీఆర్ మనవడైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతోనే టాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో జాన్వీ ఖాతాలో మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ చేరింది.
ఇక రెండో తరం హీరోల్లో మెగాస్టార్ చిరంజీవితో శ్రీదేవి చేసిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ టాలీవుడ్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. సరిగ్గా ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ, ఇప్పుడు జాన్వీ కపూర్.. చిరంజీవి వారసుడైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ (Peddi) సినిమాలో హీరోయిన్‌గా చేసింది.
హిందీ పరిశ్రమలో ఎన్ని సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో స్టార్ హోదా దక్కించుకోలేకపోయిన జాన్వీకి, సౌత్ సినిమాలు ముఖ్యంగా టాలీవుడ్ ప్రాజెక్టులు లైఫ్ లైన్‌లా మారాయి. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా కనుక థియేటర్లలో భారీ విజయం సాధిస్తే, టాలీవుడ్‌లో జాన్వీ టాప్ లీగ్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మ ఒక కీలక పాత్రలో కనిపించనుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
సోషల్ మీడియాలోనూ, సినీ సర్కిల్స్ లోనూ ఈ మెగా-నందమూరి కాంబినేషన్ల సెంటిమెంట్ పై అభిమానులు తెగ ముచ్చటించుకుంటున్నారు. అమ్మలాగే కూతురు కూడా టాలీవుడ్ అగ్ర హీరోలందరితో జతకడుతూ లక్కీ చార్మ్‌గా మారుతోందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ క్రేజీ సెంటిమెంట్స్ నిజమై ‘పెద్ది’ సినిమాతో జాన్వీ టాలీవుడ్‌లో స్థిరపడిపోతుందో లేదో చూడాలి.






