తెలుగు సినిమా చరిత్రలో భక్తిరస చిత్రాల గురించి మాట్లాడుకుంటే టక్కున గుర్తొచ్చే అద్భుత దృశ్యకావ్యం ‘అన్నమయ్య’. కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌గా నిలిచిన ఈ సినిమాను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు వెండితెరపై ఒక అద్భుతంలా ఆవిష్కరించారు. ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ ఆల్‌టైమ్ క్లాసిక్ మూవీ వెనుక ఒక ఆసక్తికరమైన గతం ఉందనే విషయం చాలామందికి తెలియదు. రాఘవేంద్రరావు కంటే ముందే మరో స్టార్ డైరెక్టర్ ఈ కథను తెరకెక్కించాలని గట్టిగా ప్రయత్నించారట.
ఆ దర్శకుడు మరెవరో కాదు.. తెలుగు ప్రేక్షకులను తన మార్కు కామెడీతో పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన హాస్యబ్రహ్మ జంధ్యాల. కేవలం నవ్వుల చిత్రాలే కాకుండా, ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ 1984లో వచ్చిన ‘ఆనందభైరవి’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. శాస్త్రీయ సంగీతం, నృత్యం నేపథ్యంలో వచ్చిన ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ నమ్మకంతోనే పదకవితా పితామహుడు అన్నమాచార్యుల జీవితచరిత్రను వెండితెరపైకి తీసుకురావాలని జంధ్యాల సంకల్పించారు.
ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం జంధ్యాల అప్పట్లోనే చకచకా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. తన ఆస్థాన సంగీత దర్శకుడు రమేష్ నాయుడితో కలిసి కూర్చుని, ఈ సినిమా కోసం ఏకంగా 40కి పైగా పాటలను కూడా రికార్డ్ చేయించడం విశేషం. అన్నమయ్య పాత్ర కోసం అప్పట్లో తెలుగు హీరోల కంటే కూడా, ముంబైకి చెందిన ఒక సరికొత్త నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆయన భావించారు. సాంకేతిక నిపుణులు, నటీనటుల ఎంపిక పూర్తయి షూటింగ్ ప్రారంభం కావడమే ఆలస్యం అనుకున్న తరుణంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది.
ఒకవేళ జంధ్యాల అనుకున్నట్లుగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కి ఉంటే, 1997లో వచ్చిన ‘అన్నమయ్య’ చిత్రం మనకు 1985లోనే విభిన్నమైన కాంబినేషన్‌లో థియేటర్లలో కనిపించేది. ఆ తర్వాత కాలంలో జంధ్యాల స్వయంగా పలు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని గుర్తుచేసుకుని ఆవేదన చెందారు. ‘ఏ గింజ మీద ఎవరి పేరు రాసి ఉంటే వారికే దక్కుతుంది’ అనే సామెతలా, చివరికి ఈ కథ రాఘవేంద్రరావు, నాగార్జునల చెంతకు చేరి టాలీవుడ్ హిస్టరీలోనే ఒక అపురూప చిత్రంగా నిలిచిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్‌డేట్ తెగ వైరల్ అవుతోంది.






