సీతాదేవి పేరు పెట్టినందుకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వటం లేదు..వాట్ నెక్స్ట్
on Jun 23, 2025
మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన 'అనుపమ పరమేశ్వరన్'(Anupama Parameswaran)తెలుగులో పలు చిత్రాల్లో నటించి అశేష అభిమానులని సంపాదించుకుంది. గత సంవత్సరం 'టిల్లుస్క్వేర్, డ్రాగన్ తో వరుస విజయాల్ని అందుకున్న అనుపమ, ప్రస్తుతం మలయాళంలో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన 'జానకి వర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ'(Janaki Versus State of Kerala)చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందనేది ఉప శీర్షిక. టైటిల్ రోల్ 'జానకి క్యారక్టర్ లో ఒక బాధితురాలితో పాటు, న్యాయం కోసం పోరాడే పాత్రని అనుపమ పరమేశ్వరన్ పోషించింది. అగ్ర హీరో సురేష్ గోపి(Suresh Gopi)లాయర్ గా కనిపిస్తున్నాడు. జూన్ 27 న రిలీజ్ కావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది.
కానీ సెన్సార్ బోర్డు ఈ మూవీపై స్పందిస్తు 'సీతాదేవి మరో పేరైన జానకి ని దాడికి గురైన మహిళకి నిర్ణయించకూడదు. మూవీలో జానకి అనే పేరుని ఉపయోగించవద్దు. సినిమా టైటిల్ తో పాటు క్యారక్టర్ పేరు మార్చాలని, సెన్సార్ బోర్డు 'జానకి వర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ'కి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్టుగా తెలుస్తుంది. మలయాళ ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ కూడా ఈ విషయాన్నీ ధ్రువీకరించింది. గతంలో కూడా ఒక సినిమా విషయంలో జానకి అనే పేరుని పెడితే సెన్సార్ సూచనతో ఆ పేరుని జయంతిగా మార్చారు.
కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న 'జానకి వర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ' కి ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వం వహించగా ఫణింద్ర కుమార్, సేతురామన్ నాయర్ నిర్మించారు. మాధవ్ సురేష్, దిలీప్, శృతి రామచంద్రన్, దివ్య పిళ్ళై తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం బిసన్, లాక్ డౌన్, పరదా, పెట్ డిటెక్టివ్ అనే సినిమాలు కూడా చేస్తుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
