Home

»

Latest News

‘అచ్చియమ్మ’ ట్రోలింగ్‌పై రియాక్ట్ అయిన 'అప్పలసూరి'. ఏమ‌న్నాడంటే..?

Jun 8, 2026 12:35PM

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’  బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లో రూ. 292 కోట్లకు పైగా వ‌సూళ్లు సాధించింద‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా చుట్టూ సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. చిత్రంలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్ర చిత్రణపై నెటిజన్లు, సినీ ప్రియుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతి బాబు జాన్వీ కపూర్‌కు అండగా నిలిచారు.

ఒక తాజా ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ.. సినిమా క్యారెక్టరైజేషన్ విషయంలో నటీనటులను వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. పాపం ఆ అమ్మాయి ఎలాంటి తప్పు లేదని, కేవలం దర్శకుడు ఏం చెబితే అది మాత్రమే చేసిందని స్పష్టం చేశారు. కొన్నిసార్లు తెరపై అనుకున్నది ఒకటైనా, ఆడియన్స్‌కు చేరేసరికి అది మిస్‌ఫైర్ అయ్యే అవకాశం ఉంటుందని, అంతమాత్రాన ఆమెను టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదే ఇంటర్వ్యూలో జగపతి బాబు ‘పెద్ది’ సినిమాలో తన 'అప్పలసూరి' పాత్ర గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం కోసం తాను ఎంతో ప్రాణం పెట్టి పనిచేశానని, షూటింగ్ సమయంలో ప్రతి షాట్‌కు చప్పట్లు కొట్టిన టీమ్.. ఇప్పుడు సినిమా విడుదలయ్యాక తన పాత్ర గురించి మాట్లాడకపోవడంపై దర్శకుడు బుచ్చిబాబును సరదాగా ప్రశ్నించినట్లు చెప్పారు. టాలీవుడ్‌లో పరభాషా నటులకు ఇచ్చే ప్రాధాన్యత మన వాళ్లకు ఇవ్వరంటూ ఒక పెద్ద డైరెక్టర్ తనకు ఫోన్ చేసి అన్న మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు.

మరోవైపు అచ్చియమ్మ క్యారెక్టర్‌పై వస్తున్న నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌పై దర్శకుడు బుచ్చిబాబు కూడా ఇప్పటికే స్పందించారు. రామ్ చరణ్, జాన్వీల మధ్య కేవలం ఒక లవ్ ట్రాక్ చూపించాలనేది తమ ఉద్దేశమని, కానీ అది ఇంత ప్రతికూలంగా మారుతుందని ఊహించలేదని తెలిపారు. ప్రేక్షకుల సెంటిమెంట్స్, అభ్యంతరాలను గౌరవిస్తూ.. చిత్రంలో వివాదాస్పదంగా అనిపించిన కొన్ని సీన్లను ఎడిట్ చేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెబుతూ అధికారికంగా ప్రకటించారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com