Home

»

Latest News

లాలో రీమేక్‌గా RC17: అసలు నిజమేంటి.. సుకుమార్ ఆ తప్పు చేస్తున్నారా.?

Nov 2, 2026 11:41AM

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ విడుదల కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. అయితే పోస్టర్‌లో నెమలి పింఛం కనిపించడంతో సోషల్ మీడియాలో ఓ కొత్త ప్రచారం మొదలైంది. గుజరాతీ హిట్ మూవీ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’కు ‘RC17’ రీమేక్ అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.

నిజానికి ‘లాలో’ సినిమా తెలుగు రీమేక్‌పై గతంలోనే వార్తలు వచ్చాయి. ఆ రీమేక్‌లో రామ్ చరణ్ శ్రీకృష్ణుడిగా కనిపించబోతున్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ‘RC17’ కాన్సెప్ట్ పోస్టర్‌లో నెమలి పింఛం కనిపించడంతో ఈ రెండు విషయాలను కలిపి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

అయితే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధం లేదనే విషయాన్ని గుర్తించాలని సినీ వర్గాలు చెబుతున్నాయి. గుజరాతీ చిత్రం ‘లాలో’ 2025లో విడుదలైంది. కానీ రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా మార్చి 2024లోనే అధికారికంగా ప్రకటించారు. పైగా, ఆ ప్రకటనకు చాలా ముందు నుంచే ‘RC17’ కథపై సుకుమార్ అండ్ టీం వర్క్ చేస్తున్నారు. కాబట్టి ‘లాలో’ను చూసి ‘RC17’ కథను సిద్ధం చేశారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది.

అంతేకాదు, ‘RRR’ ప్రమోషన్ల సమయంలోనే రాజమౌళి కూడా రామ్ చరణ్–సుకుమార్ సినిమా కథ గురించి తనకు తెలుసని చెప్పిన విషయం తెలిసిందే. అంటే ఈ ప్రాజెక్ట్ ఆలోచన, కథా చర్చలు చాలా ముందుగానే మొదలయ్యాయి.

ఇక కాన్సెప్ట్ పోస్టర్‌లో నెమలి పింఛం ఉండటంతో సినిమాలో శ్రీకృష్ణుడి ప్రస్తావన ఉంటుందా? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అయితే ఒక్క పోస్టర్ ఆధారంగా సినిమా కథను నిర్ణయించడం తొందరపాటే అవుతుంది. నెమలి పింఛం ఒక ప్రతీకగా మాత్రమే ఉండొచ్చు. దాని వెనుక ఉన్న అసలు కాన్సెప్ట్ ఏమిటనేది మేకర్స్ వెల్లడించాల్సి ఉంది.

‘పుష్ప’ సినిమాలతో సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ చరణ్‌కు కూడా ‘RRR’తో దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. అలాంటి వీరిద్దరూ 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రెండోసారి చేతులు కలిపారంటే.. ఆ ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తారో ఊహించుకోవచ్చు. ఇలా ఒక సినిమాను రీమేక్ చేస్తారంటే ఏమాత్రం నమ్మశక్యంగా లేదు.

మొత్తానికి నెమలి పింఛం కనిపించడంతో ‘లాలో’ రీమేక్‌ అనే చర్చ మొదలైనా.. ఈ రెండు సినిమాల మధ్య సంబంధం ఉందని చెప్పడానికి ఆధారాలు లేవు. సుకుమార్ తనదైన శైలిలో రామ్ చరణ్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.

ఇది కూడా చదవండి: మూడు రోజుల్లో అన్ని కోట్లా.. పోస్టర్‌తో షాకిచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ టీమ్.!

 

 

 

[RC17 Laalo Remake News, RC17 Concept Poster, Ram Charan Lord Krishna, Ram Charan Sukumar Movie, Laalo Telugu Remake, RC17 Movie, Ram Charan, Sukumar]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com