సమాజంలో గురువుకు ఉన్న స్థానం అత్యున్నతమైనది. అక్షరాలు నేర్పడమే కాదు, ఒక తరాన్ని, ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత గురువుది. కానీ, అదే గురువు తన పదవీ విరమణ తర్వాత, తన సొంత హక్కు అయిన పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తే? తన కళ్ల ముందే పెరిగిన విద్యార్థులు అవినీతి అంచున నిలబడి లంచం అడిగితే? ఆ గురువు మనసు ఎంతలా గాయపడుతుందో తెలిపే హృదయ విదారక కథనం ఇది
ఆర్.పి.పట్నాయక్ స్వీయ దర్శకత్వంలో నటించి రూపొందించిన ‘బ్రోకర్’ చిత్రంలోని ఈ సన్నివేశం దేశంలోని పరిస్థితుల్ని చూపిస్తుంది. గొల్లపూడి మారుతీరావు, అర్చన, కీర్తి చావ్లా, శ్రీహరి, ఫ్లోరా శైని ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
35 ఏళ్ళపాటు నిష్కళంకంగా సేవలందించి, ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న ఒక మాస్టారు, తన ఐదేళ్ల పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆయన అడుగుతున్నది కేవలం తన హక్కును మాత్రమే. కానీ వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి ఆయన్ని ప్రతి అడుగునా అడ్డుకుంటుంది. ‘గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ఇలా లంచాలు తినడం వ్యభిచారం కన్నా మహాపాపం’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఐదేళ్లుగా ఇద్దరు ప్రధానులు, ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా, ఆయన ఫైలు మాత్రం కదలడం లేదు. కారణం? ఆయన అధికారుల చేతులు తడపకపోవడమే.
ఆ మాస్టారు ఆగస్టు 15, 1947న, అంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే పుట్టారు. కానీ తన పుట్టిన సర్టిఫికేట్ కోసం వెతుకుతున్నప్పుడు, ఈ దేశానికి ఇంకా నిజమైన స్వాతంత్య్రం రాలేదని ఆయనకు అర్థమవుతుంది. ‘రూపాయి విలువ పడిపోవడం లేదు బాబు, ఆ రూపాయి కోసం దిగజారుతున్న మీలాంటి వాళ్ల విలువ పడిపోతోంది” అని ఆయన చెప్పే మాటలు నేటి సమాజానికి చెంపపెట్టు. చచ్చినా ఒక్క రూపాయి లంచం ఇవ్వనని, తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టనని ఆయన తెగేసి చెప్తారు.
అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, తన సొంత విద్యార్థే ‘సహాయం’ చేస్తానంటూ లంచంతో పని ముగించాలని చూడటం. ఇది ఆ మాస్టారి ఆత్మగౌరవానికి తగిలిన పెద్ద గాయం. విలువలను పాటించాలని జీవితాంతం నేర్పిన గురువే ఆ విలువలను తప్పితే, ఇక విలువలకే విలువ ఏముంటుందని ఆయన ప్రశ్నిస్తారు. అవినీతి లేని సమాజం కోసం పోరాడాలని ఉన్నా, ఆ వయసులో శక్తి లేక, యువత పట్టించుకోకపోవడం చూసి ఆయన కుమిలిపోతారు. ‘అవినీతి ముందు నిజాయితీ ఓడిపోయింది’ అని ఆయన భావించడం మన వ్యవస్థలోని వైఫల్యానికి నిదర్శనం.
ఈ కథ కేవలం ఒక ఉపాధ్యాయుడి పెన్షన్ సమస్య మాత్రమే కాదు. ఇది మన సమాజంలో వేళ్లూనుకున్న అవినీతిపై ఒక హెచ్చరిక. నిజాయితీ పరులు కూడా ఉన్నారని నిరూపించాల్సిన బాధ్యత నేటి యువతపై ఉంది. వ్యవస్థ మారాలంటే మన ఆలోచనలు మారాలి. విలువల కోసం ప్రాణాలైనా ఇచ్చే అటువంటి గురువుల ఆశయాలను గౌరవించడం మనందరి బాధ్యత. ఇంత మంచి సందేశంతో కూడిన ఈ వీడియోను చూడండి. ఆలోచించండి. చైతన్యపూరితమైన ఇలాంటి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.







