
సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas), నిధి ప్రదీప్ జంటగా నటించిన స్వచ్ఛమైన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘గోదారి గట్టుపైన’ (Godari Gattupaina) థియేటర్ల వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ‘మేమ్ ఫేమస్’ చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా, వందకు పైగా షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవమున్న సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వినూత్నమైన రీల్స్, సరికొత్త ప్రమోషన్స్ స్ట్రాటజీతో విడుదలకంటే ముందే యూత్‌లో భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ క్లీన్ అండ్ బ్రీజీ సమ్మర్ ఎంటర్‌టైనర్, బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతోంది. సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్‌ను పూర్తిగా వాడుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను, యువతను థియేటర్లకు రప్పించడంలో ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

తాజాగా విడుదలైన అధికారిక పోస్టర్ ప్రకారం, ‘గోదారి గట్టుపైన’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 8.06 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఒక చిన్న బడ్జెట్ సినిమాకు, పెద్దగా స్టార్ కాస్టింగ్ లేకపోయినప్పటికీ కేవలం కంటెంట్ వల్ల ఈ స్థాయి కలెక్షన్స్ రావడం టాలీవుడ్‌లో విశేషంగా మారుతోంది. మొదటి వీకెండ్‌లోనే మంచి వసూళ్లను సాధించిన ఈ చిత్రం, వీక్‌డేస్‌లో కూడా సత్తా చాటుతూ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది.
గోదావరి జిల్లా నేపథ్యంలోని ఒక పల్లెటూరిలో సాగే ఆటో డ్రైవర్ రాజు (సుమంత్ ప్రభాస్), ఇంజనీరింగ్ విద్యార్థిని మాయ (నిధి ప్రదీప్) మధ్య జరిగే అందమైన ప్రేమకథను, కామెడీ, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కలగలిపి దర్శకుడు సుభాష్ చంద్ర ఆకట్టుకునేలా తెరకెక్కించారు.
హీరోగా సుమంత్ ప్రభాస్ తన సహజసిద్ధమైన యాక్టింగ్, కామిక్ టైమింగ్‌తో సినిమాను వన్‌మ్యాన్ షోలా ముందుకు నడిపించారు. సీనియర్ నటుడు జగపతి బాబు హీరోయిన్ తండ్రిగా సెకండ్ హాఫ్‌లో అద్భుతమైన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా, సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై కనిపించిన అలనాటి కథానాయిక లైలా తల్లి పాత్రలో ఒదిగిపోయారు. సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వివా రాఘవ, దేవి ప్రసాద్‌ల కామెడీ ట్రాక్ ప్రేక్షకులను నవ్వించడంలో విజయవంతమైంది. అభినవ్ రావు నిర్మించిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.






