
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ (Varanasi) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మహేష్ బాబు గ్లోబల్ స్టార్ గా అవతరించడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే ‘వారణాసి’ సినిమా రావడానికి ముందే ఈ ఏడాది మహేష్ అభిమానులకు డబుల్ ట్రీట్ అందనుంది.
బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన మహేష్ బాబు కెరీర్‌లోని రెండు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఒకే రోజు థియేటర్లలో రీ-రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. లెజెండరీ యాక్టర్, సూపర్‌స్టార్ కృష్ణ జయంతి (మే 31) సందర్భంగా మేకర్స్ ప్రత్యేక పోస్టర్ల ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ న్యూస్ విన్న ఘట్టమనేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన కల్ట్ క్లాసిక్ ‘పోకిరి’, అలాగే సరికొత్త కలెక్షన్ల రికార్డులు సృష్టించిన ‘దూకుడు’ చిత్రాలు ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానున్నాయి. మహేష్ బాబు పుట్టినరోజు(ఆగస్టు 9) వేడుకలకు ముందే, ఆయన బర్త్ డే కానుకగా ఈ డబుల్ ధమాకా థియేటర్లను షేక్ చేయబోతోంది. ముఖ్యంగా ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’ విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ భారీ ప్లాన్ చేయడం గమనార్హం.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్. ఇందులో మహేష్ బాబు ‘పండు గాడు’ అనే అండర్‌కవర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించారు. ఈ సినిమాలోని డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కాకుండా మణిశర్మ అందించిన 'జగడమే', 'డోలే డోలే' వంటి చార్ట్‌బస్టర్ సాంగ్స్ అప్పట్లో యూత్‌ను ఒక ఊపు ఊపాయి. ఇప్పుడు మరోసారి ఈ చిత్రాన్ని 4K క్వాలిటీతో థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు, కమర్షియల్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘దూకుడు’ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ బాబు ‘అజయ్ కుమార్’ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా తనదైన కామెడీ టైమింగ్‌తో, యాక్షన్‌తో మెప్పించారు. అప్పట్లోనే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఈ చిత్రం టాలీవుడ్‌లో సరికొత్త మైలురాయిని క్రియేట్ చేసింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని ఆగస్టు 7న థియేటర్లలోకి భారీ ఎత్తున తీసుకువస్తోంది.
ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న గ్లోబల్ మూవీ ‘వారణాసి’ రాకముందే, పాత జ్ఞాపకాలను వెండితెరపై నెమరవేసుకుంటూ ఒకే రోజున రెండు భారీ హిట్ చిత్రాలను రీ-రిలీజ్ చేస్తుండటంతో థియేటర్ల వద్ద అభిమానుల హంగామా నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది అనడంలో సందేహం లేదు.






