
ఒక్క రోజు తేడాతో 'ఖిలాడి', 'డీజే టిల్లు' సినిమాలు విడుదలయ్యాయి. మాస్ మహారాజ రవితేజ నటించిన 'ఖిలాడి' ఫిబ్రవరి 11 న విడుదలై భారీ నష్టాలను మూటగట్టుకునే దిశగా అడుగులు వేస్తుంటే.. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన 'డీజే టిల్లు' ఫిబ్రవరి 12 న రిలీజై భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది.
'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ నటించిన సినిమా కావడంతో 'ఖిలాడి'పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా రూ.22.80 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 23.50 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఖిలాడి మొదటి రోజే నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ రాబట్టడంలో వెనకబడి పోయింది. ఆరు రోజుల్లో రూ.11.76 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా హిట్ గా నిలవాలంటే ఇంకా రూ.11.74 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఫిబ్రవరి 25 న 'భీమ్లా నాయక్' సినిమా ఉండటంతో ఈ ఎనిమిది రోజుల్లోనే ఆ మొత్తం రాబట్టాల్సి ఉంది. అయితే ఖిలాడికి వచ్చిన టాక్ ని, ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ ని బట్టి చూస్తే మరో 3-4 కోట్లు కంటే ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశంలేదు అంటున్నారు. అదే జరిగితే ఈ సినిమా దాదాపు 8-9 కోట్ల నష్టాన్ని చూడనుంది.
ఇక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'డీజే టిల్లు' రూ.8.95 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 9.50 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ సినిమా డివైడ్ టాక్ వచ్చినప్పటికీ నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాట పట్టింది. ఐదు రోజుల్లో రూ.11.62 కోట్ల షేర్ రాబట్టిన ఈ మూవీ ఇప్పటికే రూ.2.12 కోట్ల ప్రాఫిట్ లో ఉంది. భీమ్లా నాయక్ వచ్చేవరకు చెప్పుకోదగ్గ సినిమాల రిలీజ్ లేకపోవడంతో.. డీజే టిల్లు ఇంకా 7-8 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. డీజే టిల్లు జోరు ఇలాగే కొనసాగితే పదికోట్లకు పైగా లాభాలను చూసే అవకాశముంది.






