.webp)
కథని బట్టి టేకింగ్ అనేది ఎంత ముఖ్యమో, ఫొటోగ్రఫీ కూడా అంతే ముఖ్యం. ఎంతలా అంటే కథకి సంబంధించిన సదరు సన్నివేశం ప్రేక్షకుల్లోకి చొచ్చుకొనిపోయేంతలా ఫొటోగ్రఫీ అనేది ఉండాలి. ఇందుకు దర్శకుడు, కెమెరామెన్ యొక్క పరస్పర మేధస్సు చాలా ముఖ్యం. అప్పుడే కథకి సంబంధించిన భావోద్వేగాలు రీచ్ అవుతాయి. ఈ విషయంలో పర్ఫెక్ట్ గా నిలిచింది దురంధర్ పార్ట్ 1 ,పార్ట్ 2 .
ధురంధర్ కేవలం ఒక గూఢచార కథ మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన దృశ్య కావ్యం. ఈ చిత్రంలో కేవలం వెలుతురు, నీడల కాంట్రాస్ట్‌ని ఒక భావోద్వేగ ఆయుధంగా వాడుకుని దర్శకుడు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించాడు. నేటి ఆధునిక గ్రాఫిక్స్, గ్రీన్‌మ్యాట్ భ్రమల కంటే వాస్తవికతకే చిత్రబృందం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. హమ్జా అలీ మజారీ సింహాసనాన్ని అధిష్టించే సన్నివేశం ఒక మాస్టర్‌పీస్. ఈ ఒక్క ఫ్రేమ్ చూస్తే చాలు, సినిమాటోగ్రఫీ ఒక క్యారక్టర్ ఎలా మారుతుందో అర్థమవుతుంది. ముఖంపై ఒక కోణంలో పడిన లైటింగ్, మిగతా భాగాన్ని మింగేసిన గాఢమైన ఆ వెలుతురు నీడల పోరాటంలోనే ఒక గ్యాంగ్‌స్టర్ జన్మించాడు. ఇక్కడ సంభాషణల అవసరం లేదు. ఆ ఫ్రేమ్‌లోని దృశ్యమే హమ్జాలోని క్రూరత్వాన్ని, అధికారాన్ని, ఒంటరితనాన్ని మనకి వివరిస్తుంది. ఇందుకోసం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఏకంగా 6 ఎకరాల విస్తీర్ణంలో ‘ల్యారీ’ అనే ప్రత్యేక నగరాన్ని నిర్మించారు. దాదాపు 500 మంది కళాకారులు 20 రోజుల పాటు రేయింబవళ్లు శ్రమించి, ప్రతి గోడను, సందును పాకిస్తాన్ వీధులు తలపించేలా మలిచారు. గోడలపై తుప్పుపట్టిన ఇనుప కడ్డీలు, పగుళ్లు, చిరిగిన పోస్టర్ల వంటి చిన్న చిన్న వివరాలతో ల్యాండ్‌స్కేప్‌ను అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమా మొదటి భాగం సుమారు 3 గంటల 32 నిమిషాల సుదీర్ఘ నిడివితో విడుదలైనప్పటికీ, ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత కేవలం మూడు నెలల వ్యవధిలోనే 4 గంటల నిడివి గల దీని సీక్వెల్ ‘ధురంధర్-2’ కూడా విడుదలై థియేటర్లలో ప్రేక్షకులని కుర్చీలకి కట్టిపడేసింది. వివాదాస్పద సోషల్ మీడియా సెలబ్రిటీలు ఈ చిత్రంపై ఎంత నెగెటివిటీని వ్యాప్తి చేయాలని చూసినా, అవేవీ బాక్సాఫీస్ కలెక్షన్ల జోరుని ఆపలేకపోయాయి.
Also read: Vanda Devullu: వంద దేవుళ్ళు ఫస్ట్ రివ్యూ ఇదే
ఈ చిత్రానికి వికాష్ నౌలఖా సినిమాటోగ్రాఫర్. ఆయన కెమెరా అందాన్ని వెతకలేదు, సత్యాన్ని వెతికింది. ఈ చిత్రంలో ఉపయోగించిన ARRI Alexa 35 కెమెరా కేవలం చిత్రీకరణ సాధనం మాత్రమే కాదు, కథ చెప్పే ఒక మాధ్యమం. నేటి సినిమాలు కంపోజిటింగ్ కోసం ‘ఫ్లాట్ లైటింగ్’ (Flat Lighting) వాడుతున్నాయి. కానీ, ధురంధర్ ఈ అపోహను ఛేదించింది. చీకటి ఎంత ముఖ్యమో, వెలుతురు అంతే ముఖ్యమని నిరూపించిన చిత్రం ఇది. కాంట్రాస్ట్‌ను వారు ఒక భావోద్వేగ ఆయుధంగా వాడుకున్నారు. వికాష్ నౌలఖా రంగులను అద్భుతంగా ఉపయోగించారు. హమ్జా ఒక అనాధగా ఉన్నప్పుడు ఫ్రేమ్‌లు విస్తృతంగా, రంగులు సహజంగా ఉంటాయి. అతను గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగే కొద్దీ, ఫ్రేమ్‌లు గాఢంగా మారుతాయి. నీడలు పెరుగుతాయి, కాంట్రాస్ట్ తీవ్రంగా మారుతుంది.
ప్రతీకారం అనే అగ్ని అతనిలో రగులుతున్న కొద్దీ, రంగులు మసకబారి ఒక రకమైన ‘గ్రిటీ’ లుక్‌లోకి వెళ్తాయి. అంటే, పాత్ర లోపల జరిగే మార్పు తెరపై రంగుల రూపంలో మనకు కనిపిస్తుంది. నిజమైన అనుభూతి సినిమాలోని 90- 95 శాతం యాక్షన్ సన్నివేశాలను నటీనటులు స్వయంగా చేశారు. కంప్యూటర్ ద్వారా సృష్టించిన పేలుడుకు, నిజమైన మంటలకు చాలా తేడా ఉంటుంది. నిజమైన మంటలు వెలుతురును విభిన్నంగా విరజిమ్ముతాయి, నీడలు సహజంగా కదులుతాయి. ఈ “రియలిజం” వల్లే ప్రేక్షకులకు ఇది కేవలం సినిమా లా కాకుండా, ఒక నిజమైన సంఘటనలా అనిపిస్తుంది.





