Home

»

Latest News

‘పాతాళభైరవి’ నుండి ‘ధురంధర్2’ వరకు బాక్సాఫీస్ ట్రెండ్ ఇదే!

Mar 24, 2026


- బలమైన కథే అసలైన కింగ్ 

- నేటి సినిమాల సక్సెస్ మంత్రం!

- మూడు గంటల సినిమా చూస్తారా? 

- యానిమల్, పుష్ప2, ధురంధర్ 2 సృష్టించిన ప్రభంజనం ఇదే!


తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు సినిమా అంటే రెండు గంటల పది నిమిషాలు లేదా రెండున్నర గంటలు ఉండాలనే ఒక అలిఖిత నియమం ఉండేది. నిడివి ఎక్కువైతే ఆడియన్స్ బోర్ ఫీలవుతారని, థియేటర్లలో షోల సంఖ్య తగ్గుతుందని నిర్మాతలు భయపడేవారు. కానీ, ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఆ భయాలన్నీ పటాపంచలవుతున్నాయి. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు మూడు గంటలైనా, అంతకంటే ఎక్కువే అయినా కదలకుండా కూర్చుని సినిమాని ఆదరిస్తున్నారని ఇటీవలి విజయాలు నిరూపిస్తున్నాయి.

నిడివి గురించి చర్చ ఈరోజుది కాదు. 1951లో విడుదలైన 'పాతాళ భైరవి' సినిమా అప్పట్లోనే దాదాపు 3 గంటల 15 నిమిషాల నిడివితో వచ్చి సంచలనం సృష్టించింది. ఆ రోజుల్లోనే ప్రేక్షకులు కథలోని మ్యాజిక్‌కు ఫిదా అయి సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అంటే, సినిమా బాగుంటే సమయం ఒక అడ్డంకి కాదని మన పూర్వీకులు అప్పుడే నిరూపించారు. మధ్యలో కొంతకాలం కమర్షియల్ ఫార్ములా కోసం నిడివిని తగ్గించినా, ఇప్పుడు మళ్ళీ అదే పాత పద్ధతి కొత్త హంగులతో తిరిగి వచ్చింది.

ఆధునిక తెలుగు సినిమాల్లో నిడివి విషయంలో రిస్క్ తీసుకున్న సినిమా 'అర్జున్ రెడ్డి'. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం మూడు గంటలకు పైగా నిడివితో వచ్చింది. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు నిడివి తగ్గించమని ఒత్తిడి చేసినా, దర్శకుడు మొండిగా తన కంటెంట్‌ను నమ్మి ముందుకు వెళ్లారు. ఫలితం ఏంటో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో ఇప్పుడు పెద్ద దర్శకులందరూ తమ కథలకు ఎంత నిడివి అవసరమో అంత తీసుకుంటున్నారు.

ఇటీవల విడుదలైన పాన్ ఇండియా సినిమాలు రన్ టైమ్ విషయంలో అస్సలు తగ్గడం లేదు. రణబీర్ కపూర్ 'యానిమల్' సినిమా 3 గంటల 24 నిమిషాల నిడివితో వచ్చి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. అలాగే అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2' కూడా 3 గంటల 21 నిమిషాల నిడివితో థియేటర్లలో సందడి చేసింది. నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగడమే ఈ చిత్రాల విజయరహస్యం.

ఇక తాజాగా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్న 'ధురంధర్ 2' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి భాగం 'ధురంధర్' 3 గంటల 40 నిమిషాల నిడివితో ఆశ్చర్యపరిస్తే, సీక్వెల్ ఏకంగా 3 గంటల 51 నిమిషాల రన్ టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు నాలుగు గంటల నిడివి అంటే సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ, థియేటర్లు హౌస్ ఫుల్ అవుతుండటం చూస్తుంటే ఆడియ‌న్స్‌కి  కావాల్సింది క్వాలిటీ కంటెంట్ మాత్రమేనని స్పష్టమవుతోంది.

మొత్తానికి, ప్రేక్షకులకు కావాల్సింది కొత్తదనం, బలమైన ఎమోషన్స్. సినిమా నిడివి ఎంత అన్నది ఇప్పుడు సెకండరీ అయిపోయింది. కంటెంట్‌లో దమ్ముంటే ఐదు గంటలైనా చూసేందుకు సినీ ప్రియులు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో రాబోయే పెద్ద సినిమాలు కూడా ఇదే బాటలో సాగే అవకాశం కనిపిస్తోంది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com