తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు ఎప్పటికీ క్లాసిక్స్‌గా నిలిచిపోతాయి. అలాంటి చిత్రాల్లో భానుచందర్, అర్చన జంటగా నటించిన 'నిరీక్షణ' ఒకటి. బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, అందులోని సంగీతం, భావోద్వేగాలు ఇప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. తాజాగా ఈ చిత్రంలోని ఒక హార్ట్ టచింగ్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ ప్రేమికులను మరోసారి అలరిస్తోంది.
ఈ వీడియోలోని ప్రధాన ఘట్టం మురళి (భానుచందర్) తన ప్రియురాలు తులసి (అర్చన) భవిష్యత్తు కోసం చేసే త్యాగం. జైలు శిక్ష అనుభవిస్తున్న మురళి, తన కోసం తులసి తన యవ్వనాన్ని, జీవితాన్ని వృధా చేసుకోవద్దని కోరుకుంటాడు. "నేను విడుదలయ్యే సరికి ఆమెకు 30 ఏళ్లు దాటుతాయి, అప్పటి వరకు తను ఒంటరిగా ఉండకూడదు" అనే ఉద్దేశంతో ఆమెను వేరే పెళ్లి చేసుకోమని కోరుతూ ఒక లేఖ రాస్తాడు. ఆ లేఖను తన బాబాయ్ ద్వారా ఆమెకు పంపిస్తాడు.
పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మురళి జైలు నుండి విడుదలవుతాడు. విడుదలయ్యే సమయంలో అతని మనసులో ఒకటే సంఘర్షణ. తులసి తన మాట విని పెళ్లి చేసుకుని ఉంటుందా? లేక తన కోసమే వేచి చూస్తూ ఉంటుందా? అనే అయోమయం అతడిని వెంటాడుతుంది. "ఆమె పెళ్లి చేసుకుందని తెలిస్తే తట్టుకోలేను, అలాగని నాకోసం వేచి ఉండి తన జీవితాన్ని పాడు చేసుకున్నా భరించలేను" అని అతను పడే వేదన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది.
మురళి తన విడుదల గురించి చెబుతూ తులసికి మరో లేఖ రాస్తాడు. అందులో ఒక కీలక నిబంధన పెడతాడు. తాను ఊరి గుండా వెళ్లేటప్పుడు, వారు ఎప్పుడూ కలుసుకునే చెట్టు కింద ఒకే ఒక్క దీపం వెలిగించి ఉంటే, ఆమె ఇంకా తన కోసమే ఎదురుచూస్తుందని అర్థం చేసుకుంటానని చెబుతాడు. ఒకవేళ అక్కడ దీపం లేకపోతే, ఆమె తన జీవితంలో స్థిరపడిందని భావించి తాను మౌనంగా వెళ్ళిపోతానని పేర్కొంటాడు.
ఈ సన్నివేశం మొత్తం ఎంతో భావోద్వేగభరితంగా సాగుతుంది. తులసి తన ప్రేమ కోసం పడే తపన, ఆమె ప్రార్థనలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. ప్రేమికుల మధ్య ఉండాల్సిన స్వచ్ఛమైన ప్రేమ, ఒకరి క్షేమం కోసం మరొకరు చేసే త్యాగం ఈ సీన్‌లో అద్భుతంగా ఆవిష్కరించబడింది. ఇళయరాజా సంగీతం ఈ సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ క్లైమాక్స్‌లో విశేషం ఏమిటంటే.. మురళి బస్సులో ప్రయాణిస్తూ తన ప్రేమకథను ఒక పెద్దాయనకి చెబుతుంటాడు. దాన్ని బస్సులోని అందరూ ఎంతో ఆసక్తిగా వింటారు. మురళితోపాటు వాళ్లు కూడా ఎంతో ఉత్కంఠగా ఆ చెట్టుకోసం ఎదురుచూస్తారు.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమకథలు రావడం అరుదనే చెప్పాలి. అందుకే ఈ పాత సినిమాల క్లిప్పింగ్స్ చూసినప్పుడు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు", "భాను చందర్ నటన, అర్చన కళ్ళు అన్నీ ఒక కావ్యంలా ఉన్నాయి" అంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. నిరీక్షణ అంటే కేవలం ఎదురుచూపు మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన బంధం అని ఈ సీన్ మరోసారి నిరూపించింది. ఇలాంటి సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.






