
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒకప్పుడు కొండంత అండగా నిలిచి, ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన మహానుభావుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao). వందలాది మందికి సినీ జీవితాన్ని ప్రసాదించి, టాలీవుడ్‌ను ముందుండి నడిపించిన ఆయన భౌతికంగా దూరమైనా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు.
అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక దారుణమైన వార్త ఇండస్ట్రీ వర్గాలతో పాటు కోట్లాది మంది సినీ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఎందరికో లైఫ్ ఇచ్చిన ఆ మహనీయుడి సమాధి ప్రస్తుతం అత్యంత పాడుబడ్డ స్థితిలో, గుర్తుపట్టలేనంత దారుణంగా మారిపోవడం అందరినీ కలచివేస్తోంది.
వాస్తవానికి తెలుగు సినిమా చరిత్రలో దాసరి నారాయణరావుది తిరుగులేని అధ్యాయం. ఒక దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా వందలాది చిత్రాలను తెరకెక్కించడమే కాకుండా, రాజకీయ నాయకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. కానీ, ప్రస్తుతం ఆయన సమాధి చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు మొలిచి ఒక అడవిలా తయారైంది. ఎంట్రెన్స్ దగ్గర నుంచి కనీసం లోపలికి కూడా వెళ్లలేని విధంగా ముళ్లు, చెత్తాచెదారం, గాజు పెంకులు పేరుకుపోయాయి.
2017 లో దాసరి నారాయణరావు మరణించిన తర్వాత, 2011 లో అంతకుముందే మరణించిన ఆయన భార్య పద్మావతి సమాధి పక్కనే ఈయన సమాధిని కూడా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. కానీ నేడు ఆ రెండు సమాధులు కనీసం క్లీన్ చేసే నాథుడు లేక దుమ్ము పట్టి, కలుపు మొక్కల మధ్య కూరుకుపోయాయి.
ఆస్తులు పంచుకున్న వారసులు దాసరి సమాధి సంరక్షణను పట్టించుకోకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "సినీ పెద్ద, గురువుగారు" అంటూ పిలిచిన సినీ ప్రముఖులు సైతం ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
నాడు ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా 'నేనున్నానంటూ' ముందు నిలబడిన ఆ పెద్ద మనిషికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా టాలీవుడ్ ప్రముఖులు స్పందించి, వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించి దర్శకరత్నకు తగిన గౌరవం దక్కేలా చేయాలని సినీ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.






