ENGLISH | TELUGU  

కరోనా దెబ్బకు టాలీవుడ్ అతలాకుతలం!

on Jan 7, 2022

కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ పై కరోనా పంజా విసురుతోంది. రెండేళ్లుగా ఎందరో సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కరోనా కారణంగా ఎన్నో సినిమాలు ఆలస్యమవుతూ వచ్చాయి. సెకండ్ లాక్ డౌన్ తరువాత థియేటర్స్ రీఓపెన్ అయ్యాయి.. అఖండ, పుష్ప వంటి సినిమాలు సత్తా చాటాయి, ఇక టాలీవుడ్ కి మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్న సమయంలో.. మళ్ళీ మహమ్మారి విజృంభణ ప్రారంభమైంది. ఆ దెబ్బకి టాలీవుడ్ నుండి వస్తున్న భారీ సినిమాలు 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' వాయిదా పడ్డాయి. ఓ వైపు పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయన్న నిరాశలో ఉన్న సినీ అభిమానులకు.. ఇది చాలదు అన్నట్లు టాలీవుడ్ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే యంగ్ హీరోలు మంచు మనోజ్, విశ్వక్ సేన్ కరోనా బారిన పడగా.. తాజాగా మరికొందరు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇటీవల సీనియర్ హీరోయిన్ మీనా కుటుంబమంతా కరోనా బారిన పడింది. తాజాగా మహేష్ బాబుకి కరోనా సోకింది. ఇటీవ‌లే ఆయ‌న వ‌దిన శిల్పా శిరోద్క‌ర్‌ కు కూడా కరోనా అని తేలింది. ఇటీవ‌ల మ‌హేష్ కుటుంబం, శిల్ప కుటుంబం దుబాయ్‌లో సెల‌వులు గ‌డిపారు. అక్క‌డే వీరికి కొవిడ్ సోకిందని తెలుస్తోంది. ఇక మంచు ఫ్యామిలీలో మరొకరు కూడా కరోనా బారిన పడ్డారు. తనకి కరోనా సోకిందని తాజాగా మంచు లక్ష్మి తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి కూడా తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే హీరో నితిన్ భార్య షాలిని కూడా కరోనా బారిన పడ్డారు.

కరోనా కారణంగా భారీ సినిమాల విడుదల వాయిదా పడటంతో పాటు పలు సినిమాల షూటింగ్స్ కూడా నిలిచిపోతున్నాయి. కరోనా ప్రభావం దృష్ట్యా 'లైగర్' షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. ఇలా సినిమా రిలీజ్ లు, షూటింగ్ లు వాయిదాపడి వడ్డీలు పెరిగిపోయి ప్రొడ్యూసర్స్ కి పెనుభారంగా మారుతోంది. కరోనా ప్రభావం తగ్గిపోయిందని భావిస్తున్న తరుణంలో చాప కింద నీరులా విస్తరించిన మహమ్మారి ఒక్కసారిగా పంజా విసరడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసులు, సినిమాల వాయిదాతో టాలీవుడ్ ని కరోనా అతలాకుతలం చేస్తోంది. టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతుండటం వారి కుటుంబసభ్యులతో పాటు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. వారు త్వరగా కోలుకోవాలని, ఈ కరోనా కోరల నుండి టాలీవుడ్ బయటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.