Home

»

Latest News

అప్పుడు ‘రుద్రవీణ’కి మూడు జాతీయ అవార్డులు.. ఇప్పుడు ‘కమిటీ కుర్రోళ్లు’కి రెండు.!

Jul 20, 2026 11:01AM

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ల మీద పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో నిహారిక కొణిదెల రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ మూవీతో యదు వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటుకుంది. ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీల్లో రెండు జాతీయ అవార్డులను ‘కమిటీ కుర్రోళ్లు’ కొల్లగొట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తమ ఆనందాన్ని పంచుకునేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు చిత్రానికి జాతీయ అవార్డులు రావడంతో నా మనసు సంతృప్తితో నిండిపోయింది. నా 32 ఏళ్ల ఈ జీవితంలో ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకి ఓకే చెప్పడంతో గొప్ప నిర్ణయం. ఇది నా సినిమా, ప్రాణం పెట్టాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో అందరి కష్టం ఉంది. మంచి సినిమా తీసినప్పుడు ఇలాంటి ఓ గొప్ప ఫీలింగ్ కలుగుతుందంటే.. నా జీవితంలో ఎప్పుడూ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లను. యదు వంశీ గారు ఎప్పుడూ నేషనల్ అవార్డ్ వస్తుందని చెబుతూనే ఉండేవారు. కానీ నేను ఒక నేషనల్ అవార్డ్ సినిమా తీయాలని ‘కమిటీ కుర్రోళ్లు’ని నిర్మించలేదు. ఈ జర్నీలో మాత్రం నేను కూడా జాతీయ అవార్డు రావాలని కోరుకున్నాను. 72వ జాతీయ అవార్డుల్లో మేం కూడా ఉండాలని అనుకున్నాను. నా కల నేడు నెరవేరింది. ఆర్టిస్టుల్ని 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లుగా మారేందుకు ఎంతో మేకోవర్ జరిగింది. ఈ జర్నీలో రవి, అక్షయ్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. రవికి నేషనల్ అవార్డ్ రావడం ఆనందంగా ఉంది. 

మా నాన్న తీసిన ‘రుద్రవీణ’కి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. మా పెదనాన్న గారు, బాబాయ్ గారు సినిమాకి సేవ చేశారు. నేను కొణిదెల ఫ్యామిలీ నుంచి వచ్చాను.. ఏదో ఒకటి చేశాను అని ఇప్పుడు అనిపిస్తోంది. నేను మెగా ఫ్యామిలీలో ఉన్నాను.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాను అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ ఫ్యామిలీలో నేను ఉండేందుకు అర్హురాలిని అని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను. సినిమా చూసిన తర్వాత మీడియా, ఆడియెన్స్ ఇలా అందరూ కూడా నేషనల్ అవార్డ్ వస్తుందని అన్నారు. మాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. చిరంజీవి గారే అందరికీ గర్వకారణం అని నేను ఫీల్ అవుతుంటాను. ఆయనే నన్ను గర్వకారణం అని అనడంతో ఎంతో ఆనందంగా ఉంది. ‘రుద్రవీణకి మీ నాన్న (నాగబాబు) తీసుకున్నారు.. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావ్.. మాకెంతో గర్వంగా ఉంది’ అని ఆయన అనడం నాకు మరింత గర్వంగా ఉంది’’ అని అన్నారు.

దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు నేషనల్ అవార్డ్ కొడుతుందని ముందు నుంచీ అందరికీ చెప్తూనే వచ్చాను. చాలా మంది ఈ మూవీని నిర్మించేందుకు ప్రయత్నించారు. కానీ ఎవ్వరి వల్లా కాలేదు. ఓ కొత్త సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టేందుకు చాలా మంది సాహసించలేదు. కానీ మన్యం రమేష్ గారు నాకు సపోర్ట్ చేశారు. కొత్త వాళ్లతో అంటే ఎవరు మాత్రం ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. కానీ నేను చెప్పిన ప్రతీ ఒక్క ఆప్షన్‌కి మన్యం రమేష్ గారు, నిహారిక గారు ఓకే చెప్పారు. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ తమ తమ పాత్రల కోసం బరువులు తగ్గారు, పెరిగారు. మేకప్‌కి అవార్డు రావాలని చాలా కోరుకున్నాను. బెస్ట్ ఫిల్మ్ అంటే.. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్, టెక్నిషయన్ బెస్ట్ ఇస్తేనే వస్తుంది. ఎవరెన్ని చెప్పినా కూడా నిహారిక గారు ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు. పెట్టిన 9 కోట్ల గురించి నిహారిక గారు ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక్క రూపాయి బిజినెస్ కాకపోయినా ధైర్యంతో నిహారిక గారు అడుగు ముందుకు వేశారు. అలా ప్రారంభమైన ప్రయాణాన్ని ఆమె ఇప్పుడు జాతీయస్థాయిలో నిలబెట్టారు. మీడియా ముందు ఇప్పుడు నేను ఏడ్వలేను (నవ్వుతూ). నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.

 

 

Committee Kurrollu, National Awards, Niharika Konidela, Yadhu Vamsee

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com