Home

»

Latest News

త్రిషతో కలిసి అజిత్ ఇంటికి వెళ్లిన సీఎం విజయ్!

Jun 1, 2026 4:08PM

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అజిత్ తల్లి మోహిని మణి శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన 89వ ఏట తుదిశ్వాస విడిచారు. ఈ చేదు వార్త తెలిసే సమయానికి దుబాయ్‌లో ఉన్న అజిత్ కుమార్, వెంటనే అత్యవసర ఏర్పాట్లు చేసుకుని శనివారం మధ్యాహ్నానికే చెన్నై చేరుకున్నారు.

మోహిని మణి మరణవార్త వినగానే తమిళ చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay), స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) అజిత్ నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. సీఎం విజయ్ తన చేతిలో పూలదండ పట్టుకొని రాగా, అజిత్ గేటు వద్దే ఆలింగనం చేసుకుని లోపలికి తీసుకువెళ్లారు. అజిత్ భుజం తట్టి ఓదార్చిన సీఎం విజయ్ మరియు త్రిష, బాధిత కుటుంబ సభ్యులతో కాసేపు గడిపి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దశాబ్దాల కాలంగా స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఒకరినొకరు గౌరవించుకునే విజయ్, అజిత్‌ల మధ్య ఉన్న స్నేహబంధం ఈ కష్టసమయంలో మరోసారి స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముఖ్యమంత్రి విజయ్ అంతకుముందే సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. "నా ప్రియ మిత్రుడు అజిత్ కుమార్ తల్లి మోహిని అమ్మియార్ గారి మరణవార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. జీవితంలోని అన్ని దశల్లోనూ అజిత్‌కు రక్షణ కవచంగా నిలిచి, అతడిని నడిపించిన తల్లిని కోల్పోవడం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అంటూ విజయ్ తన సంతాపాన్ని ప్రకటించారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com