- రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం..
- ప్రభాస్ సినిమాకు ఆ 5 కేసులు శాపమయ్యాయా?
- రాజా సాబ్ రిలీజ్ రోజు జరిగిన హైడ్రామా ఇదే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందిన 'ది రాజా సాబ్' చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదలైన సమయం కంటే, అంతకు ముందు రోజు రాత్రి జరిగిన ‘పెయిడ్ ప్రీమియర్స్’ రచ్చ టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా తెలంగాణలో ప్రీమియర్ షోల విషయంలో నెలకొన్న గందరగోళంపై తాజాగా మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధి శశి స్పందించారు.
నిజానికి 'ది రాజా సాబ్' ప్రీమియర్స్ కోసం నైజాం ఏరియాలో భారీ ఏర్పాట్లు జరిగాయి. కానీ చివరి నిమిషంలో షోలు రద్దు కావడం, టికెట్ రేట్లపై స్పష్టత లేకపోవడంతో థియేటర్ల వద్ద అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ రాత్రి ఏం జరిగిందనే దానిపై క్లారిటీ ఇస్తూ.. ఆ సమయంలో కోర్టులో ఐదు కేసులు పెండింగ్‌లో ఉన్న విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని శశి పేర్కొన్నారు. ఆ కేసులను క్లియర్ చేసి, డాక్యుమెంటేషన్ పూర్తి చేసేసరికి సమయం మించిపోయిందని ఆయన వివరించారు.
ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయని ఆశించినప్పటికీ, కోర్టు ఉత్తర్వుల కాపీలు చేతికి అందేసరికి బుధవారం రాత్రి అయ్యిందని శశి తెలిపారు. దీంతో గురువారం ఉదయం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, జీవో రావడంలో జాప్యం జరిగిందని చెప్పారు. "అధికారులు వస్తుందని చెబుతున్నా, సాంకేతిక కారణాల వల్ల అది లేట్ నైట్ అయింది. స్టార్ హీరో సినిమా కావడంతో రిస్క్ తీసుకోలేక షోలు రద్దు చేయాల్సి వచ్చింది" అని ఆయన ఆనాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు.
మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రంపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ కొండంత ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో చూపిస్తామని మేకర్స్ ఇచ్చిన హామీతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, ప్రీమియర్స్ సమయంలో జరిగిన ప్లానింగ్ లోపం వల్ల అభిమానులు థియేటర్ల వద్ద నానా హంగామా చేశారు. విమల్ థియేటర్ వంటి ప్రధాన కేంద్రాల్లో పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గతంలో ప్రభాస్ నటించిన 'సలార్', 'కల్కి' వంటి చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చిన నేపథ్యంలో, 'రాజా సాబ్' కూడా అదే రేంజ్‌లో వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు ఆశించాయి. కానీ ఈ ప్రీమియర్ షోల ఎఫెక్ట్ సినిమా టాక్‌పై కూడా కొంత ప్రభావం చూపిందని ఇండస్ట్రీ టాక్. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, రాబోయే పెద్ద సినిమాల విషయంలో కనీసం రెండు వారాల ముందే అనుమతులు పొందేలా జాగ్రత్తలు తీసుకుంటామని శశి వెల్లడించారు.
ప్రస్తుతం ఈ గందరగోళం ముగిసినా, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆ 'కాళరాత్రి'ని అంత సులభంగా మర్చిపోలేకపోతున్నారు. మరోవైపు ప్రభాస్ తన తదుపరి చిత్రాలైన 'సలార్2', 'స్పిరిట్' పనుల్లో బిజీగా ఉండగా, మారుతి తన తర్వాతి ప్రాజెక్టుపై దృష్టి సారించారు.






