Home

»

Latest News

లెజండ్రీ దర్శకుడి మృతి: కొన్ని దశాబ్దాలపాటు ప్రేక్షకులని పరిపాలించిన చక్రవర్తి! 

Oct 27, 2026 5:26PM


భారతీయ టెలివిజన్ చరిత్రలో ఒక గొప్ప శకం ముగిసింది. ఎన్నో తరాల ప్రేక్షకులకి  దశాబ్దాలుగా ఉత్కంఠభరితమైన దర్యాప్తులతో కట్టిపడేయ్యడంతో పాటు, దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందిన ‘సీఐడీ’ (CID) ధారావాహిక సృష్టికర్త, ప్రముఖ నిర్మాత, దర్శకుడు బ్రిజేంద్ర పాల్ సింగ్ (బీపీ సింగ్) అకస్మాత్తుగా కన్ను మూసారు.

ఈ రోజు ఉదయం ముంబైలోని శాంతాక్రూజ్ ఆసుపత్రిలో 77 సంవత్సరాల వయసులో తీవ్ర గుండెపోటుతో  తుదిశ్వాస విడిచారని సినీ ప్రముఖులు వెల్లడించారు.  మరణవార్త తెలియగానే టెలివిజన్ రంగంలోనూ, లక్షలాది మంది సీఐడీ అభిమానులలోనూ తీవ్ర విషాదం అలుముకుంది.  బ్రిజేంద్ర పాల్ సింగ్ కేవలం ఒక సాధారణ దర్శకుడు మాత్రమే కాదు, భారతీయ టెలివిజన్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ రూపురేఖలను పూర్తిగా మార్చివేసిన సంచలన సృష్టికర్త. ప్రఖ్యాత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) నుంచి డైరెక్షన్‌లో పట్టా పుచ్చుకున్న ఆయన, తన అద్భుతమైన ప్రతిభతో టెలివిజన్ తెరపై విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. 


ఆయన సృష్టించిన ‘సీఐడీ’ సీరియల్ భారతీయ టెలివిజన్ చరిత్రలోనే అత్యంత కాలం పాటు (రెండు దశాబ్దాలకు పైగా, 1998 నుంచి నిరంతరంగా) విజయవంతంగా ప్రసారమైన రికార్డు సృష్టించింది. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఉత్కంఠను నింపుతూ కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ధారావాహికలో ప్రసిద్ధ పాత్రలైన ఏసీపీ ప్రద్యుమన్, దయా, అభిజీత్, మరియు డాక్టర్ సాలుకేలతో పాటు, స్వయంగా బీపీ సింగ్ డిసీపీ శమషేర్ సింగ్ చిత్రోలే క్యారక్టర్ పోషించి విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు.కేవలం క్రైమ్ థ్రిల్లర్స్‌ మాత్రమే కాకుండా, ప్రేక్షకులకి వెన్నులో వణుకు పుట్టించే సరికొత్త హారర్ అనుభూతిని అందించిన ‘ఆహట్’ (Aahat) ధారావాహికను కూడా 1995 నుంచి ఆయన ఘనవిజయవంతంగా నిర్మించారు. సుదీర్ఘకాలం పాటు ప్రసారమైన ఈ హారర్ షో కూడా టీవీ ప్రేక్షకులను ఎంతగానో భయపెడుతూనే విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే భారతదేశపు మొట్టమొదటి సైలెంట్ కామెడీ షో అయిన ‘గూటూరు గు’ (Gutur Gu, 2010) తో పాటు ‘షపత్’ వంటి విభిన్నమైన టెలివిజన్ ప్రాజెక్ట్‌లని సైతం  విజయవంతంగా తెరకెక్కించి తన బహుముఖ ప్రజ్ఞ చాటుకున్నారు. 


ఇది కూడా చదవండి: పవన్ వైఫ్ అన్నా లెజినోవా షాకింగ్ డెసిషన్: డిలీట్ ఎందుకు చేసింది!

 


ఎఫ్‌టీఐఐ (FTII) అధ్యక్షుడిగా కూడా సేవలందించిన ఆయన, ఎంతోమంది యువ టెక్నీషియన్లకు, సృష్టికర్తలకు మార్గదర్శిగా నిలిచారు. బీపీ సింగ్ అకస్మాత్ మరణం పట్ల ప్రముఖ చలనచిత్ర దర్శకుడు అశోక్ పండిత్ తదితర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారతీయ విజువల్ మీడియా రంగానికి, ముఖ్యంగా టెలివిజన్ పరిశ్రమకి తీరని లోటని అభివర్ణించారు. క్రైమ్ మరియు సస్పెన్స్ జోనర్‌లలో ఆయన వేసిన బలమైన ముద్ర ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తుందని కొనియాడారు.  అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు సమాచారం. 

 

 

[Cid Director Bp Singh Passed Away, CID director BP Singh, Brijendra Pal Singh passed away, CID creator dead, Aahat producer BP Singh, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com