
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంతో దూసుకుపోతోంది. ఎమోషనల్ అండ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సాధించిన ఘన విజయంతో మెగా కుటుంబంలో ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), సురేఖ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ గురించి దర్శకుడు బుచ్చిబాబు ఎంతో ఎమోషనల్ అవుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా భారీ రెస్పాన్స్‌తో థియేటర్లలో రన్ అవుతుండటం, ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రశంసలు దక్కడంపై బుచ్చిబాబు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో అవ్వగానే.. మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ బుచ్చిబాబును అస్సలు ఊహించని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం పొల్లాచిలో షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి సినిమా సూపర్ హిట్ టాక్ వినగానే వెంటనే సెట్స్ నుంచే బుచ్చిబాబుకు కాల్ చేశారు. ఫోన్ లైన్‌లోకి రాగానే మెగాస్టార్ ఎంతో పరవశంతో, ఆనందంతో 'బుచ్చిబాబు.. బుచ్చిబాబు.. బుచ్చిబాబు..' అంటూ దాదాపు 8 నుంచి 9 సార్లు బుచ్చిబాబు పేరునే పదే పదే కలవరించినట్లు దర్శకుడు ఎంతో ఎమోషనల్‌గా గుర్తుచేసుకున్నారు. ఒక లెజెండరీ యాక్టర్ తన పేరును అన్ని సార్లు పిలవడం తన లైఫ్‌లోనే మర్చిపోలేనని బుచ్చిబాబు అన్నారు.
చిరంజీవి గారు అంతటితో ఆగకుండా, “అబ్బా.. అబ్బా.. ఏం సినిమా తీశావ్ బుచ్చిబాబు! ఏం ఫిలిం ఇది! గాడ్ బ్లెస్ యు.. నువ్వు చాలా మంచి రేంజ్‌కి, నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తావు” అంటూ కురిపించిన ప్రశంసల జల్లు తనకెంతో బూస్టింగ్ ఇచ్చిందని బుచ్చిబాబు సంతోషం వ్యక్తం చేశారు. మెగాస్టార్ లాంటి పెద్దాయన నోట ఇలాంటి మాటలు వినడం ఒక దర్శకుడిగా తన జన్మ ధన్యమైందని ఫీలయ్యారు.
చిరంజీవి గారి అప్రిసియేషన్ తర్వాత సురేఖ గారు, ఉపాసన గారు, నిహారిక గారు అందరూ ఫోన్ చేసి సినిమా అద్భుతంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారని బుచ్చిబాబు వెల్లడించారు. మెగా ఫ్యామిలీ అంతా 'పెద్ది' సక్సెస్‌ను ఓన్ చేసుకోవడం విశేషం.
ముఖ్యంగా థియేటర్లలో సాధారణ ఆడియన్స్, లేడీస్ రియాక్షన్ గురించి బుచ్చిబాబు చెప్తూ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. “నేను స్వయంగా రెండు మూడు థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల రెస్పాన్స్ చూశాను. స్క్రీన్ కింద నుంచి ఆడియన్స్‌ను గమనిస్తే.. సినిమా చివర్లో వచ్చే ఎమోషన్‌కు కనెక్ట్ అయి థియేటర్లలో ఏకంగా 75 శాతం మంది ఆడపిల్లలు, లేడీస్ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. ఒక ఆవిడైతే తన చంటి బిడ్డను పక్కన ఉన్నవారికి ఇచ్చేసి మరీ ఎమోషనల్ సీన్లకు కళ్లు వత్తుకోవడం నా కళ్లారా చూశాను” అని బుచ్చిబాబు ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు.
ఒక డైరెక్టర్‌గా తాను, రామ్ చరణ్ సార్ ఈ రూరల్ కథను ఎంత గట్టిగా నమ్మామో.. సాధారణ ప్రేక్షకులు కూడా దాన్ని అంతే ఓన్ చేసుకున్నారని బుచ్చిబాబు అన్నారు. తాము పడ్డ కష్టానికి ఇండస్ట్రీ నుంచి, ప్రేక్షకుల నుంచి దక్కిన బెస్ట్ అప్రిసియేషన్, రివార్డ్ ఇదేనని ఆయన ముగించారు.





.webp)
