
వెండితెరపై తనదైన నటనతో ప్రేక్షకులను అలరించే మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఓటీటీలోనూ సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ కోసం ఆయన ఓ టాక్ షో చేస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ షోకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ‘మెగావర్స్’ పేరుతో రూపొందుతున్న ఈ షో షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో చిరంజీవితో కలిసి బ్రహ్మానందం, సునీల్, సత్య సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ ముగ్గురూ ‘మెగావర్స్’ తొలి ఎపిసోడ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. బ్రహ్మానందం, సునీల్, సత్య.. ఈ ముగ్గురూ ఒకే వేదికపై కనిపిస్తే కామెడీకి కొదవ ఉండదనే చెప్పాలి. ఇప్పుడు వీరితో కలిసి చిరంజీవి కూడా సందడి చేయబోతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. ఈ ముగ్గురితో మెగాస్టార్ చేసే సంభాషణలు ఎలా ఉంటాయి? వారి కెరీర్‌లోని ఫన్నీ సంఘటనలు, చిరంజీవితో ఉన్న అనుబంధాలు బయటకు వస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా ఫస్ట్ ఎపిసోడ్ లో బ్రహ్మానందం పాల్గొనడం అనేది ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పొచ్చు. చిరంజీవి హీరోగా నటించిన 'చంటబ్బాయ్'(1986) సినిమాతోనే బ్రహ్మానందం సినీ ప్రయాణం మొదలైంది. అప్పటినుంచి ఇద్దరి మధ్య ఎంతో బాండింగ్ ఉంది. ఈ 40 ఏళ్ళ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఇద్దరి సంభాషణ సాగితే, అప్పటి ఆసక్తికర విషయాలను పంచుకుంటే.. ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనడంలో డౌట్ లేదు.

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘మెగావర్స్’ తొలి సీజన్‌లో సుమారు 15 ఎపిసోడ్లు ఉండనున్నాయి. ఈ షో షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
‘మెగావర్స్’ కేవలం సరదా సంభాషణలకే పరిమితం కాకుండా.. చిరంజీవి ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితంలోని అనుభవాలు, రాజకీయ ప్రయాణం వంటి అంశాల చుట్టూ సాగనున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. సినీ రంగంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, విజయాలు, తోటి నటీనటులతో ఉన్న అనుబంధాలు వంటి విషయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
మొత్తానికి సినిమాల్లోనే కాకుండా, సెలబ్రిటీలతో సరదాగా ముచ్చటిస్తూ చిరంజీవి మరో కొత్త కోణంలో కనిపించబోతున్నారు. బ్రహ్మానందం, సునీల్, సత్యలతో మొదలయ్యే ఈ షోలో ఇంకా ఎవరెవరు పాల్గొంటారు? మెగాస్టార్ తన సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎలాంటి ఆసక్తికర విషయాలను పంచుకుంటారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక అప్‌డేట్స్ కోసం వేచి చూడాల్సిందే.
ఇది కూడా చదవండి: NBK112 మ్యూజిక్ డైరెక్టర్.. అనిరుధ్ స్థానంలో ఆ యంగ్ సెన్సేషన్.?
[Chiranjeevi OTT Show First Guest, Brahmanandam, MegaVerse First Episode, Chiranjeevi Netflix Show, Chiranjeevi MegaVerse, Chiranjeevi OTT Show, Chiranjeevi OTT Debut, Netflix Telugu Shows, Telugu Film News]





