
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన లేటెస్ట్ మూవీ "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram). జూన్ 19న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి వీకెండ్ లోనే రూ.40 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'మా ఇంటి బంగారం' మూవీ టీమ్ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ని కలిసి బ్లెస్సింగ్స్ అందుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు.
"మా ఇంటి బంగారం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు. సమంత నటన, ముఖ్యంగా చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి వైవిధ్యమైన, మహిళా ప్రాధాన్య చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు అవసరం. ఈ విజయానికి సమంత, నందిని రెడ్డి, రాజ్ మరియు మొత్తం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు." అని చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇక రీసెంట్ గా సమంత తల్లి కాబోతుందని, ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా పరోక్షంగా కన్ఫర్మ్ చేశారు మెగాస్టార్. "జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత & రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు" అని చిరంజీవి తన ట్వీట్ లో రాసుకొచ్చారు.
మెగాస్టార్ ట్వీట్ తో సమంత తల్లి కాబోతుందనే వార్త నిజమేననే క్లారిటీ వచ్చేసింది. దీంతో అభిమానులు సమంత దంపతులకు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు.






