
- చిరంజీవి-బాబీ మూవీ క్రేజీ అప్‌డేట్
- సెకండాఫ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ వేరే లెవెల్
- మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తన సత్తా చాటారు. ఈ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ విజయోత్సాహంతో ఉన్న మెగాస్టార్, ఏమాత్రం విరామం తీసుకోకుండా తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. (Mega 158)
మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానుంది.
ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చిరంజీవిని మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత శక్తివంతమైన మాస్ అవతార్‌లో చూపించబోతున్నారట. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.
ఈ ఎపిసోడ్‌లో చిరంజీవి ఒక 'మాఫియా డాన్' పాత్రలో కనిపిస్తారని, ఆ సమయంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయని టాక్ వినిపిస్తోంది. బాబీ ఇప్పటికే స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేసి, ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేశారు.

గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమాలో చిరు మాస్ మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ అభిమానులను విపరీతంగా అలరించాయి. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
చిరంజీవి కెరీర్ లో 158గా సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ ని కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. టాలీవుడ్‌లో ఈ బ్యానర్‌కు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. యశ్ తో 'టాక్సిక్', విజయ్ తో 'జన నాయగన్' వంటి భారీ సినిమాలను నిర్మిస్తున్న ఈ బ్యానర్, చిరు సినిమాను కూడా భారీ బడ్జెట్ తో నిర్మించనుంది.
ఈ సినిమాలో ఇతర నటీనటుల విషయానికి వస్తే, సీనియర్ నటి ప్రియమణి ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కూడా మరో ముఖ్యమైన పాత్రలో మెరవనుంది.
అంతేకాకుండా, తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని, చిరంజీవి తన కూతురిని కాపాడుకునే తండ్రిగా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. మాస్ యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌ను కూడా సమపాళ్ళలో జోడించి బాబీ ఈ సినిమాని మలుస్తున్నారట.
'వాల్తేరు వీరయ్య' మ్యాజిక్‌ను బాబీ మళ్ళీ రిపీట్ చేస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది.
ప్రస్తుతం చిరంజీవి తన మరో భారీ ప్రాజెక్ట్ 'విశ్వంభర' పనుల్లో కూడా బిజీగా ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్న 'విశ్వంభర'.. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: అవకాశాల్లేక ఈగలు తోలుకుంటున్నా.. కంటతడి పెట్టిస్తున్న మణిశర్మ కామెంట్స్!






