
బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో మెగాస్టార్ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. విశాఖపట్నం నేపథ్యంలో నడిచే ఈ సినిమాకు 'వాల్తేరు మొనగాడు', 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే సుమంత్ హీరోగా 'వాల్తేర్ శీను' అనే టైటిల్‌తో ఓ సినిమా మేకింగ్‌లో ఉండటంతో, మెగాస్టార్ 154వ సినిమాకు వేరే టైటిల్ అన్వేషణలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో మాస్ మహారాజా ఓ కీలక పాత్రలో.. అదీ చిరు తమ్ముని పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారంలో ఉంది.
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూవీలో తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహా విలన్‌గా నటించున్నాడు. ఈ మూవీలో తాను నటిస్తున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇది రెగ్యులర్ విలన్ టైప్ రోల్ కాదనీ, దాని కోసం ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సిన అవసరం ఉందనీ ఆయన చెప్పాడు. ఫస్ట్ టైమ్ చిరంజీవితో నటించేందుకు ఎగ్జయిటింగ్‌గా ఉందని తెలిపాడు.
నిజానికి బాబీ సింహా తెలుగువాడే. హైదరాబాద్‌కు చెందిన ఆయన కుటుంబం 1995లో కోడైకెనాల్‌కు తరలివెళ్లింది. అయితే చిన్నప్పుడు కృష్ణా జిల్లాలోని మోపిదేవిలో తెలుగు మీడియం స్కూలులోనే చదువుకున్న బాబీ సింహా, తెలుగులో తొలిసారిగా సందీప్ కిషన్ మూవీ 'రన్'లో పూర్తి స్థాయి పాత్రలో కనిపించాడు. రవితేజ 'డిస్కో రాజా' మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించిన ఆయన సందీప్ కిషన్ 'గల్లీ రౌడీ'లో ఐపీఎస్ ఆఫీసర్ రోల్‌లో అదరగొట్టాడు. ఇటీవల ఓటీటీలో నేరుగా రిలీజైన విక్రమ్ మూవీ 'మహాన్'లో ఆయన ఫ్రెండ్ సత్యవాన్ క్యారెక్టర్‌లో సూపర్బ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన బాబీ సింహా ఇప్పుడు ఏకంగా మెగాస్టార్‌ను ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నాడు.






