
టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఎగ్జిబిటర్స్ వివాదం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. రామ్ చరణ్ (Ram Charan) ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' (Peddi) విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.
ఇకపై థియేటర్లలో ఏ సినిమా ప్రదర్శించాలన్నా పాత రెంటల్ విధానం కుదరదని, మల్టీప్లెక్స్ తరహాలోనే కచ్చితంగా 'పర్సంటేజ్ సిస్టమ్' అమలు చేయాల్సిందేనని అసోసియేషన్ తేల్చి చెప్పింది. 'పెద్ది' అయినా, లేక మరే ఇతర పెద్ద సినిమా అయినా సరే.. ఈ నిబంధన అందరికీ వర్తిస్తుందని థియేటర్ల యజమానులు ఖచ్చితంగా చెబుతున్నారు.
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ ఆవేదనను పంచుకున్నారు. పెద్ది సినిమాపై తమకు పగ లేదని, ఈ సినిమా తర్వాత మళ్ళీ తమను పట్టించుకోరనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. "గతంలో 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ సమయంలోనే రెండు నెలల్లో మా సమస్యను పరిష్కరిస్తామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కమిటీ హామీ ఇచ్చింది, కానీ ఏడాది గడిచినా ఎలాంటి పురోగతి లేదు" అని సభ్యులు గుర్తు చేశారు.
పర్సంటేజ్ విధానాన్ని కావాలనే కొందరు నిర్మాతలు ఆలస్యం చేస్తున్నారని, 120 మందికి పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వారు పేర్కొన్నారు.
దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పటికే ఈ పర్సంటేజ్ విధానం విజయవంతంగా నడుస్తోందని, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే దీనిని ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఎగ్జిబిటర్లు ప్రశ్నించారు. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోయి ఎగ్జిబిటర్లకు పైసా ఆదాయం మిగలడం లేదని, అదే సమయంలో నిర్మాతలకు మాత్రం థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రూపంలో 14 రకాలుగా ఆదాయం వస్తోందని వారు గుర్తుచేశారు.
ఈ సమస్యపై అవసరమైతే మెగాస్టార్ చిరంజీవిని కలిసి తమ బాధలను చెప్పుకుంటామని, నిర్మాతలు పర్సంటేజ్ సిస్టమ్‌పై సంతకం పెడితేనే 'పెద్ది' సినిమా రిలీజ్‌కు సహకరిస్తామని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్పష్టం చేసింది.
టికెట్ ధరల పెంపు విషయంలోనూ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా ఇచ్చినట్లు తెలిపింది.
ఈ పరిణామాలతో రాబోయే పెద్ద సినిమాల విడుదలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన మొదలైంది.






