
మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన విజయ్ ఆంటోని హీరోగా మారి మంచి కంటెంట్ ఉన్న చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ‘నకిలీ’, ‘డాక్టర్ సలీమ్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ చిత్రంతో తమిళంలోనే కాదు.. తెలుగులోనూ బ్లాక్ బస్టర్ సాధించి ఇక్కడా తనదైన మార్కెట్‌ను సృష్టించుకున్నాడు. భేతాళుడు, యముడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.
ప్రస్తుతం ఈయన హీరో గా తెలుగు, తమిళ భాషల్లో 'జ్వాల' సినిమా తెరకెక్కుతోంది. అంతే కాకుండా విజయ్ ఆంటోని నిర్మాతల హీరో. నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కరోనా సమయంలో వారికి తన రెమ్యునరేషన్ నుండి 25 శాతం తగ్గించుకుని సినిమాలు చేస్తూ తన సహృదయాన్ని చాటుకున్నాడు. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా, మరోవైపు హీరోగా రాణిస్తోన్న విజయ్ ఆంటోని పుట్టినరోజు జూలై 24. ఈ సందర్భంగా ఆయన కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. విజయ్ ఆంటోని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'బిచ్చగాడు'కు ఇది సీక్వెల్. అయితే ఈ విషయాన్ని ఆరోజే వెల్లడించనున్నారు.







