
హీరోయిన్.. ఈ పదం వింటే చాలు పూనకంతో ఉగిపోని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఇందుకు భూమి పెడ్నేకర్ అతీతురాలేమి కాదు. బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకుంది. పవిత్రమైన శ్రావణ మాసం (సావన్) ప్రారంభం కావడంతో, ఆధ్యాత్మిక భావనతో ఆలయాన్ని దర్శించుకున్న భూమి పెడ్నేకర్.. అక్కడ చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపింది.
శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివునికి జలాభిషేకం చేస్తూ ఆమె దిగిన ఫోటోలు, వీడియోలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. అయితే, ఆ వీడియోలో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నప్పటికీ, ఆమె కళ్లకు నల్లటి సన్ గ్లాసెస్ (గాగుల్స్) ధరించి ఉండటంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు
ఆలయంలో శివలింగానికి జలాభిషేకం చేస్తున్న సమయంలో భూమి పెడ్నేకర్ బ్లాక్ టాప్, బ్లూ డెనిమ్ జీన్స్ ధరించారు. అంతవరకు బాగానే ఉన్నా, పూజ చేస్తున్న సమయం మొత్తం కళ్లకి ఉన్న సన్ గ్లాసెస్ తీయకపోవడమే నెటిజన్ల ఆగ్రహానికి ప్రధాన కారణమైంది. ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, "శ్రావణ మాసం ప్రారంభమవుతున్న వేళ, నా జీవితం తేలికగా ఉండాలని నేను కోరుకోవడం లేదు; దాన్ని ఎంతో గౌరవంతో, ధైర్యంతో నడిపించే శక్తినే ప్రసాదించమని వేడుకుంటున్నాను.. హర్ హర్ మహాదేవ్" అంటూ ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని క్యాప్షన్‌గా రాసుకొచ్చారు. అయితే, ఈ క్యాప్షన్ ఎంత గొప్పగా ఉన్నప్పటికీ, నెటిజన్లు మాత్రం ఆమె ధరించిన సన్ గ్లాసెస్ పైనే దృష్టి సారించారు.
ఈ పోస్ట్ నెట్టింట ప్రత్యక్షమైన క్షణాల్లోనే వేలాది కామెంట్లు వచ్చి పడ్డాయి. వందలాది మంది నెటిజన్లు ఆమె వైఖరిని తప్పుబడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "కనీసం దేవుడికి పూజ చేసేటప్పుడైనా సన్ గ్లాసెస్ తీసి పూజ చేయలేరా?", "ఇది భక్తితో చేసిన పూజలా లేదు, ఏదో ఫ్యాషన్ ఫోటోషూట్ లాగా ఉంది" ."దేవుడిని కూడా కూలింగ్ గ్లాసెస్ వెనుక నుంచే చూస్తారా? కొంచెమైనా భక్తి, శ్రద్ధ ఉండాలి కదా!" "మనుషులు పూజలో కూడా స్టైల్, ఫ్యాషన్ వెతుకుతున్నారు, లేకపోతే సామాన్య ప్రజలకి వీరికి తేడా ఉండదు కదా".దేవుడి ముందు వినమ్రంగా ఉండాల్సింది పోయి ఇలా గ్లాసెస్ పెట్టుకుని ఫోటోలు దిగడం భక్తిని అవమానించడమేనని అత్యధిక శాతం మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ విమర్శల తుఫాను మధ్య కొంతమంది అభిమానులు భూమి పెడ్నేకర్‌కు మద్దతుగా కూడా నిలిచారు. భక్తి అనేది మనసులోని భావమని, బాహ్య రూపం లేదా వారు వేసుకునే దుస్తులు, సన్ గ్లాసెస్ ఆధారంగా ఒకరి భక్తిని అంచనా వేయలేమని కొందరు కామెంట్ చేశారు. కాగా, ఈ వివాదంపై భూమి పెడ్నేకర్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. సినీ కెరీర్ విషయానికి వస్తే, దర్శకుడు సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం 'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్'లో భూమి పెడ్నేకర్ వీరనారి బెలవాడి మల్లమ్మ పాత్రలో నటిస్తున్నారు. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఈ రెండు భాగాల సినిమాలో వివేక్ ఒబెరాయ్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న భూమి పెడ్నేకర్, శ్రావణ మాసం పూజ సందర్భంగా సన్ గ్లాసెస్ వివాదంలో చిక్కుకోవడం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Bhumi pednekar, sivalayam






