Home

»

Latest News

Bethlehem Kudumba Unit Review Telugu: 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' మూవీ రివ్యూ

Sep 4, 2026 3:59PM

నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్'. ‘ప్రేమలు’ సినిమాతో మళయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన డైరెక్టర్ గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇప్పటికే మలయాళంలో విడుదలై రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్.. ఇప్పుడు తెలుగు వెర్షన్ లో థియేటర్లలో విడుదలైంది. మరి ఈ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
జస్టిన్ (నివిన్ పౌలీ) ఒక క్యాటరింగ్ సర్వీస్ నడుపుతుంటాడు. గతంలో ఒక విషాదకరమైన ప్రేమకథ తర్వాత 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా, తన తమ్ముడు (సంగీత్ ప్రతాప్), స్నేహితులతో కలిసి సరదాగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. మరోవైపు, తండ్రి తాగుడు అలవాటు వల్ల ఊరు మారి వచ్చిన ఆష్లీ (మమితా బైజు) కుటుంబం జస్టిన్ ఇంటి పక్కనే అద్దెకు దిగుతుంది. వీరిద్దరి మధ్య స్థానిక చర్చికి చెందిన ప్రార్థనా బృందం 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' ద్వారా పరిచయం ఏర్పడుతుంది. కాలేజీ చదువుకునే 20 ఏళ్ల జెన్-జీ అమ్మాయి ఆష్లీ, 90s కిడ్ అయిన జస్టిన్ మధ్య ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే వీరిద్దరికి 13 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంటుంది. కుటుంబం, సమాజం ఏమంటారో అని తమ ప్రేమను దాచడానికి వీరు పడే తాపత్రయం, ఆ తర్వాత పెద్దలకు తెలిసాక జరిగే పరిణామాలు ఏంటి అనేదే ఈ చిత్ర కథాంశం.

విశ్లేషణ:
ఒక సింపుల్ పాయింట్‌తో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లలో ఎంటర్టైన్ చేయడం అంత తేలికైన విషయం కాదు. కానీ డైరెక్టర్ గిరీష్ ఏడీ తన మార్క్ మేజిక్‌తో దాన్ని చేసి చూపించారు. ఎక్కడా ఎంబారసింగ్‌గా లేకుండా, న్యాచురల్ కామెడీతో ఫస్ట్ హాఫ్ అంతా పరుగులు పెట్టించారు. ముఖ్యంగా జస్టిన్ ఏజ్ గురించి వచ్చే కౌంటర్లు, జస్టిన్ చెల్లెళ్లతో ఆష్లీ చేసే లేడీస్ డ్రింకింగ్ పార్టీ ఎపిసోడ్, అలాగే తమ్ముడి షార్ట్ ఫిలిం గోల థియేటర్లలో గట్టిగా నవ్వులు పూయిస్తాయి.

గిరీష్ ఏ.డి అందించిన వన్-లైనర్స్, సిట్యుయేషనల్ కామెడీ ఈ సినిమాకు మెయిన్ అసెట్. ‘ప్రేమలు’ ఎంత ఫ్రెష్ ఫీల్ ఇచ్చిందో, ఇందులో కూడా ప్రతి ఐదు నిమిషాలకు ఒక సాలిడ్ హ్యూమర్ బ్లాక్ వర్కవుట్ అయింది. సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి డైలాగ్ మనం నిజజీవితంలో కనెక్ట్ చేసుకునేలా ఉంటాయి.

అయితే, సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్‌లో స్పీడ్ కాస్త తగ్గుతుంది. మలయాళ సినిమాల్లో సహజంగా ఉండే కొన్ని సబ్‌ప్లాట్స్, అనవసరమైన డ్రాగ్ సీన్స్ వల్ల నిడివి కాస్త ఎక్కువైన భావన కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్ కూడా కాస్త సాగదీతగా అనిపించినప్పటికీ, క్లైమాక్స్ మాత్రం మెప్పిస్తుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
నివిన్ పౌలీ జస్టిన్ పాత్రలో చాలా సహజంగా ఒదిగిపోయారు. తనలోని వింటేజ్ కామెడీ టైమింగ్‌ని మళ్లీ గుర్తుచేశారు. ఇక మమితా బైజు అయితే స్క్రీన్ మీద మరోసారి మాయ చేసింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. నివిన్-మమితల మధ్య ఉన్న ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇక 'ప్రేమలు' ఫేమ్ సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్ కనిపించిన ప్రతిసారీ తమ కామెడీ టైమింగ్‌తో నవ్వించారు.

విష్ణు విజయ్ అందించిన సంగీతం కథలోని ఫీల్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. కేరళ అందాలను ప్రశాంతమైన పెయింటింగ్‌లా చూపించిన అజ్మల్ సాబు కెమెరా వర్క్ ఎంతో ప్లెజెంట్‌గా ఉంటుంది. ఆకాష్ జోసెఫ్ ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. తెలుగు డబ్బింగ్ రైటింగ్ బాగుంది. మన నేటివిటీకి తగ్గట్టుగా పంచ్ డైలాగ్స్ కుదిరాయి.

ఫైనల్ గా..
కుటుంబం మొత్తం కలిసి హాయిగా నవ్వుకునేలా రూపొందించిన ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ‘ప్రేమలు’ టైప్ ఫ్రెష్ అండ్ క్లీన్ హ్యూమర్‌ని కోరుకునే వారికి ఇది నచ్చుతుంది.

 

Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.

 

 

 

[Bethlehem Kudumba Unit Review Telugu, BKU Telugu Review, Nivin Pauly, Mamitha Baiju, Girish AD, Premalu Director, Telugu Cinema Review, Telugu Movie Review]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com