Home

»

Latest News

సుప్రీం కోర్టుకు బండ్ల గణేశ్.. ఆస్తి వేలం వివాదంలో కొత్త ట్విస్ట్.!

Jul 15, 2026 4:32PM

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తన వ్యక్తిగత ఆస్తి వేలం వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు సినీ, వ్యాపార వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాదం హైదరాబాద్‌కు చెందిన 'శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్'కు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిన రుణాలకు సంబంధించినది. ఈ సంస్థకు చెందిన రుణాల కోసం బండ్ల గణేశ్, ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత ఆస్తులను పూచీకత్తుగా ఉంచి గ్యారెంటర్లుగా వ్యవహరించారు.

కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో, కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (CIRP) జరుగుతుండగా బ్యాంక్ అధికారులు తనఖా పెట్టిన ఆస్తిని వేలం వేశారు. అయితే, ఈ వేలం ప్రక్రియ చట్టవిరుద్ధమని బండ్ల గణేశ్ పేర్కొంటున్నారు. వన్-టైమ్ సెటిల్‌మెంట్ (OTS) కింద ఇప్పటికే రూ. 71.44 కోట్లతో కలిపి మొత్తం సుమారు రూ. 129.02 కోట్లను బ్యాంక్ వసూలు చేసిందని, బకాయిలన్నీ తీరిపోయిన తర్వాత కూడా బ్యాంక్ తన ఆస్తిని వేలం వేయడం అన్యాయమని ఆయన తన పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై గతంలో రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (DRT-II), హైదరాబాద్‌కు బండ్ల గణేశ్ ఫిర్యాదు చేయగా, ట్రిబ్యునల్ ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వేలం ప్రక్రియ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న డీఆర్‌టీ, వేలం ద్వారా స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి యజమానులకు అప్పగించాలని, అలాగే ఆస్తిని కొనుగోలు చేసిన వారికి వడ్డీతో సహా సొమ్మును తిరిగి చెల్లించాలని బ్యాంక్‌ను ఆదేశించింది.

అయితే, ఈ తీర్పుపై యూనియన్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు డీఆర్‌టీ ఆదేశాలను కొట్టివేస్తూ బ్యాంక్ చర్యలను సమర్థించింది. ఆస్తి వేలం ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవని, గ్యారెంటర్ల ఆస్తులను విక్రయించే హక్కు బ్యాంకుకు ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. 

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, న్యాయం కోసం బండ్ల గణేశ్ తాజాగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఆస్తిని కాపాడుకునేందుకు ఆయన చేస్తున్న ఈ న్యాయపోరాటం ప్రస్తుతం కీలక మలుపు తిరిగింది. బ్యాంక్ వసూలు చేసిన భారీ మొత్తం, ఆస్తుల వేలంపై ఉన్న చట్టపరమైన సందేహాలను సుప్రీంకోర్టు ఎలా పరిష్కరిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

 

Bandla Ganesh, Property Auction, Supreme Court, Union Bank of India

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com