
తనదైన స్పీచ్‌లతో వార్తల్లో నిలవడం నటుడు, నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh)కు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ‘బ్యాండ్ మేళం’(Band Melam) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న బండ్ల గణేష్, మరోసారి తన మార్క్ కామెంట్స్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు. ముఖ్యంగా స్టార్ వారసుల సక్సెస్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు వస్తుంటారని, కానీ అందరూ సక్సెస్ కాలేరని బండ్ల గణేష్ అన్నారు. కేవలం రామ్ చరణ్, మహేష్ బాబు వంటి అతికొద్ది మందికి మాత్రమే ఆ స్టార్‌డమ్ దక్కిందని, మిగిలిన వారికి కేవలం ఆస్తులు మాత్రమే దక్కుతాయని కానీ సక్సెస్ రాదని ఆయన బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సక్సెస్ అనేది ఎవరి చేతుల్లో ఉండదని, అది భగవంతుడు ఇచ్చేదని ఆయన అభిప్రాయపడ్డాడు.
ఇక ఈ సినిమా కోసం కోన వెంకట్ పడిన కష్టాన్ని బండ్ల గణేష్ కొనియాడాడు. కోన వెంకట్ ఈ చిత్రం కోసం తన సొంత ఆస్తులను కూడా తాకట్టు పెట్టారని, అంతటి ప్యాషన్ ఆయనకు సినిమా మీద ఉందని చెప్పారు. “నేనైతే చచ్చినా నా ఆస్తులు తాకట్టు పెట్టి సినిమాలు తీయను, కానీ కోన వెంకట్ సినిమాను అంతలా ప్రేమిస్తారు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. కోన వెంకట్ అండగా ఉంటే ఎవరైనా ఇండస్ట్రీలో గెలిచేయొచ్చని బండ్ల గణేష్ పేర్కొన్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సినిమాలో నటించిన యంగ్ హీరో రోషన్ ని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ హీరో ఫైర్ చూస్తుంటే ముచ్చటేసిందని, “నువ్వు నా కొడుకువై పుడితే బాగుండేది” అని లోపల అనిపించిందంటూ మనసులో మాట బయటపెట్టాడు. తన కొడుకు కూడా ఆ హీరోలాగా ఎదగాలని బ్లెస్ చేయమంటూ అడగడం అక్కడి వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మొత్తానికి బండ్ల గణేష్ స్పీచ్ అంటేనే ఒక సెన్సేషన్. ఇక ఈ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సినిమా వర్గాల్లో పెద్ద చర్చకే దారితీశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.




